నైటీ వేసుకుంటే ఫైన్ కట్టాల్సిందే!

09 November, 2018 - 2:59 PM

(న్యూవేవ్స్ డెస్క్)

తోకలపల్లి (ప.గో.జిల్లా): ఆ గ్రామంలో మహిళలు పగటిపూట నైటీలు ధరించి ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. ఒకవేళ అలా చేస్తే రెండు వేల రూపాయలు జరిమానాగా కులపెద్దల సంఘానికి కట్టాల్సిందే! ఇదీ కొల్లేటి గ్రామాల్లోని కులపెద్దలు జారీ చేసిన హుకుం.. ఈ మేరకు ఆ గ్రామంలోని సామాజిక భవనం మైక్‌ ద్వారా దండోరా కూడా వేయిస్తుండడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా కొల్లేరు ప్రాంతంలోని నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో ఈ నిబంధన గడచిన ఆరు నెలలుగా అమలవుతుండడం విశేషం.

నిజానికి.. కొల్లేటి గ్రామాల్లో న్యాయపరమైన విషయాలను వారి కుల పెద్దలు విచారించి నిర్ణయం తీసుకుంటారు. మిగిలిన గ్రామస్థులంతా కులపెద్దల తీర్పునకు కట్టుబడి ఉంటారు. ఏళ్ల తరబడిగా వస్తున్న ఆచారం ఇది. అయితే.. మహిళలు పగటిపూట నైటీలు ధరించకూడదంటూ వారు ఆంక్షలు పెట్టడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే కులపెద్దల ఆంక్షల్ని సమర్థిస్తున్నారు.
మహిళలు రాత్రి పూట మాత్రమే నైటీలు ధరించాలని కులపెద్దలు షరతు పెట్టారు. పగటి పూట నైటీలు ధరించిన మహిళలను చూపించిన వారికి వెయ్యి రూపాయలు నజరానా ఇస్తామని కూడా వారు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే.. గ్రామం నుంచి బహిష్కరించేందుకు కూడా వెనుకాడేదిలేదని కుల పెద్దలు హెచ్చరించారు.

ఇలా ఉండగా.. మహిళలు నైటీలతోనే స్కూళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు, మార్కెట్లకు వచ్చేస్తున్నారని, పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం మంచిదేనని కొందరు సమర్థిస్తున్నారు. మహిళల దుస్తుల విషయంలో గ్రామ పెద్దల ఆంక్షలేంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. పగటిపూట నైటీ వేసుకుని పొరపాటున బయటికొస్తే.. పెద్దల మాటను ధిక్కరించినట్లా? దానికే గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారా? అని మండిపడుతున్నారు. వారి మనోభావాలను బయటపెడితే గ్రామ పెద్దలను ఎదిరించినట్లవుతుందని సర్దుకుపోతున్నట్లు తెలుస్తోంది.

తోకలపల్లిలో న్యాయవ్యవస్థ గ్రామ కమ్యూనిటీహాల్‌ వద్దే ఉంటుంది. గ్రామంలో వడ్డీల కులపెద్దల నిర్ణయమే ఫైనల్‌. వారే న్యాయమూర్తులు. వడ్డీలంతా ఏకమై ఏటా తొమ్మిది మందిని కులపెద్దలుగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఒకసారి పెద్దగా ఎన్నికయ్యాక తిరిగి పదేళ్ల వరకూ తీర్పులిచ్చే పీఠం ఎక్కే అవకాశం ఉండదు. ఎన్నికైన నాటి నుంచి ఏడాది వరకూ వారు ఆ పదవిలో ఉంటారు. గ్రామంలో ఏదైనా సమస్య వస్తే.. దానిపై కుల పెద్దలు ఇచ్చిన తీర్పును ఆచరించాల్సిందే. నచ్చినా.. నచ్చకపోయినా.. తీర్పును శిరసావహించాల్సిందే. మహిళల నైటీ విషయంలో గ్రామ పెద్దలు తీసుకున్న ఆంక్షలు మింగుడుపడని పలువురు మహిళలు.. పెద్దల ఆంక్షల్ని తొలగించాలని కోరుకుంటున్నారని సమాచారం.

మహిళలు నైటీలు ధరించడంపై ఆరు నెలలుగా బహిరంగంగా మైక్‌‌లో ప్రచారం జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. గ్రామం కట్టుబాట్ల విషయంలో వారిని కాదని ఎవ్వరూ ఏ విధమైన ఫిర్యాదు చెయ్యకపోవడం వల్లే తమకు తెలియదని అధికారులు అంటున్నారు. అయితే.. నైటీలపై ఆంక్షల సమాచారం అందుకున్న తాసీల్దార్‌ ఎం.సుందర్రాజు, ఎస్‌ఐ ఎం.విజయ్‌‌కుమార్‌ గ్రామంలో ఇంటింటికీ తిరిగి విచారించి, వివరాలు సేకరించారు. దీనిపై ప్రాథమిక నివేదికను ఉన్నతాధికారులకు అందించినట్లు తెలిసింది.

అయితే.. నైటీల్ని రాత్రి మాత్రమే ధరించేలా గ్రామంలోని అందరూ కట్టుబడి ఉండేలా నిర్ణయం తీసుకోవాలని పలువురు మహిళలు కోరారని, వారి కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని కుల పెద్ద బలే సీతారాముడు చెప్పడం గమనార్హం. ఇంతవరకూ ఎవ్వరికీ జరిమానా విధించలేదని, గ్రామ బహిష్కరణ అని తాము అనలేదని చెప్పారు.