ఎల్బీ స్టేడియంలో ‘సైరా’

12 September, 2019 - 3:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసేందుకు ముహుర్తం ఖరారు చేసినట్లు ఈ చిత్ర బ్యానర్ కొణిదెల ప్రోడక్షన్ కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు ట్రైలర్ విడుదల వేడుక సెప్టెంబర్ 18న హైదరాబాద్‌లోని ఎల్ బీ స్టేడియం వేదికగా జరుగుతుందని పేర్కొంది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్, ప్రముఖ దర్శకులు రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివ తదితరులు హాజరవుతారని తెలిపింది. అలాగే చిత్ర పరిశ్రమతోపాటు రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని వెల్లడించింది.

కాగా ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. దాంతో తొలుత తెలుగు ట్రైలర్ విడుదల చేసి.. ఆ తర్వాత మిగిలిన భాషల్లో ట్రైలర్ విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కోణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సందీప్, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తున్నారు.