తీరు మారిన సినిమా ప్రకటనలు!

07 November, 2017 - 11:40 PM

♦ మీడియా పల్స్-

కొన్ని సినిమాలు విడుదలయితే టీవీ చానళ్లలో వార్తలుగా ఎంతో సమయం పొందు తాయి. వాటికి సంబంధించిన కార్యక్రమాలు వస్తే-ఎంతో కాలంగా ప్రసారం అవుతున్న కార్యక్రమాలు కూడా అటక ఎక్కేస్తుంటాయి. లెక్కకు మిుంచిన సంఖ్యలో చానళ్లున్నాయి కనుక ఈ పోకడలన్నీ గమనించడం కష్టమే. అయితే ఇటీవల కాలంలో కొన్ని పత్రికలలో కొన్ని సినిమాలకు సంబంధించి ‘ప్రకటనా వ్యాసాలు’ అనిపించే రీతిలో సమీక్షలు ప్రత్యేకంగా వెలువడిన సందర్భాలు న్నాయి. ఈ సంవత్సరంలో మరీ ముఖ్యంగా కొన్ని నెలలుగా తెలుగు పత్రికలలో సినిమా ప్రకటనల సంఖ్య పెరిగిందనిపిస్తోంది. ఇదివరకు పూర్తి పేజీ, అరపేజీ, పావు పేజీ ప్రకటనలు కనబడేవి కావు. కానీ, ఇపుడు వీటి కోసం ప్రత్యేకంగా ఒక పేజీ అవసరమైనట్టు కనబడుతోంది. తెలుగులో మూడు పత్రికలు గమనిస్తే ఎక్కువ ప్రకటనలు ఆంధ్రజ్యోతిలో, తర్వాతి సంఖ్య సాక్షిలో కనబడుతున్నాయి. ఈనాడులో తక్కువ!

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మూడు నెలల క్రితం అనంతపురం జిల్లా హిందూపురం వెళ్లినప్పుడు అక్కడ బస్టాండులో దొరికిన కన్నడ దినపత్రికలు రెండు కొనుక్కొన్నా. ఆ పత్రికలు ఎలా ఉన్నాయో చూడాలని! అక్షరాలు దాదాపు పోల్చుకోవచ్చు కనుక కొంతవరకు బోధపడుతుంది కూడా. ఆ రెండు పత్రికలు ఒకే ధర-ఐదు రూపాయలు. ఎక్కువ పుటలు. ఆ రోజు శుక్రవారం. వరలక్ష్మీవ్రతం. కనుక ఎక్కువ పేజీలు. ‘ఉదయవాణి’ పత్రిక 46 పేజీలుండగా, ‘విజయ కర్నాటక’ 30 పేజీలు. ఒకప్పుడు కన్నడ భాషలో ప్రజావాణి, కన్నడ ప్రభ, సంయుక్త కర్నాటక పత్రికలే కనబడేవి. కానీ నేడు పరిస్థితి మారింది. కొన్నేళ్ల క్రితం ‘విజయ కర్నాటక’ పత్రికను ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక కొనుగోలు చేసింది. ప్రస్తుతం కర్నా టకలో కన్నడ, ఆంగ్ల పత్రికలలో ఆ సంస్థ పత్రికలే సర్క్యులేషన్‌లో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇక ఉదయవాణి మంగుళూరు ప్రధాన కేంద్రంగా ఉండే టీ ఏ పాయ్ వారసులకు చెందిన పత్రిక. రాజకీయ కుటుంబమయిన వారికి ఆ ప్రాంతంలో చాలా సంస్థలున్నాయి.

ఉదయవాణి 46 పేజీలలో 47 సినిమా ప్రకటనలు సుమారు 27 పేజీలు ఆక్రమించాయి. అందులో తొలిపుట (జాకెట్)తో సహా 7 పూర్తి పేజీలు కాగా, 20 సినిమాలవి అరపేజీ ప్రకటనలు. ‘విజయ కర్నాటక’లో కూడా చాలా సినిమా ప్రకటనలున్నాయి. రెండింటిలోనూ శుక్రవారం కనుక సినిమా అనుబంధాలున్నాయి.

బాగా సర్క్యులేషన్‌లో ఉన్న పత్రికల్లో  ప్రకటనల ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. మరి టీవీ చానళ్లలో కూడా ప్రకటనలు లాంటి కార్యక్రమాలు విరివిగానే ఉంటాయి. ఈ పత్రికలూ ప్రకటనలూ చూస్తుంటే నలభయ్యేళ్ల క్రితం తెలుగు పత్రికలు గుర్తుకొచ్చాయి. త్వరలో వస్తుంది, రేపే విడుదల, నేడే చూడండి, విజయవంతంగా నడుస్తోంది, రమ్యమైన రెండోవారం, నలుగురు మెచ్చే నాలుగోవారం, అర్ధ శతదినో త్సవం, చేరువలో శతదినోత్సవం…వంటి శీర్షికలలో సినిమా ప్రకటనలు బాగా కనబడేవి. అప్పట్లో మరే ప్రసార మాధ్యమం కీలకం కాదు కనుక పరిస్థితి అలా ఉండేది. రేడియో, టెలివిజన్, న్యూ మీడియా వచ్చాక ప్రచారం తీరు మారిపోయింది. ప్రస్తుతం పోస్టర్లు బాగా తగ్గిపోయాయి కూడా.

తెలుగు దినపత్రికలలో పెరిగిన సినిమా ప్రకటనల తీరు గురించి మద్రాసు మిత్రులు, ప్రముఖ నిర్మాత, నిర్మాతల మండలి బాధ్యులు కాట్రగడ్డ ప్రసాద్ గారితో టెలిఫోన్‌లో చర్చించాను. సినిమా పరిశ్రమ శ్రేయస్సు దృష్ట్యా నిర్మాతల మధ్య ఒక అంగీకారం ఉండేది. నిర్మాతల ఆర్థిక పరిస్థితి దెబ్బతినకుండా ప్రకటనల విషయంలో కొన్ని నియమాలు పాటించబడేవి. అయితే ఇటీవల కాలంలో పది, పదిహేను మంది నిర్మాతలు ఎక్కువ వ్యయం పెట్టి పెద్ద సైజులో పత్రికలలో ప్రకటనలు, చానళ్లలో కార్యక్రమాలు ఇస్తున్నారట. రెెండు వేలకు మించి ఉన్న తెలుగు సినీ నిర్మాతలలో వందమందికి పైబడి క్రమం తప్పకుండా సినిమాలు తీసే నిర్మాతలున్నారని తెలుస్తోంది. తమిళ సినిమా రంగంలో ఈ ప్రకటనల మీద షరతులు ఇంకా కఠినంగా ఉన్నాయి. వీరి సూచనలు అతిక్రమించారని ఒక ఆంగ్లదినపత్రికకు సినిమా ప్రకటనలు ఇవ్వడం లేదట. నిజానికి కన్నడ సినీపరిశ్రమ తెలుగు, తమిళ పరిశ్రమల కన్నా టర్నోవరు విషయంలో, బడ్జెట్ విషయంలో, సినిమాల సంఖ్యలో చిన్నదే! అయితే ప్రకటనల విషయంలో ప్రస్తుతం కన్నడ ముందుంది. ఇందులో ఆ నిర్మాతల ఉత్సాహం మాత్రమే కాదు, మీడియా సంస్థల వ్యూహాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని గమనించాలి. 

సినిమాల ప్రకటనలు, ప్రచారం విషయంలో తెలుగులో అయితే బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని చెప్పుకోవాలి. బాహుబలి సినిమా పబ్లిసిటీకి భారీ ఎత్తున వ్యయం చేశారని ఆర్థిక దినపత్రికలలో లోతైన విశ్లేషణలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలలో సంపాదకీయ పుటలలో పరిచయాలు, ఆర్థిక దినపత్రికలలో సంపాదకీయాలు, ఇతర పత్రికల్లో వార్తలు, సమీక్షలు వచ్చాయి.

కానీ సినిమా ప్రకటనలు పెద్దగా రాలేదు. నేడు పోకడ మారింది-ప్రకటనలు పావుపేజీ, అరపేజీ వస్తున్నాయి. ఈ ధోరణి భాష బట్టి ఉంటోంది. తమిళ హీరో విజయ్ సినిమా మాతృకకు లేని పూర్తి పేజీ ప్రకటన తెలుగులో కనబడుతోంది. ఇలా ఎన్నో పోకడలు సినిమాల ప్రచారంలో ఉన్నాయి. న్యూ మీడియా గురించి మరోసారి మాట్లాడుకుందాం.

-డా. నాగసూరి వేణుగోపాల్
మీడియా విశ్లేషకులు