అత్యంత ఖరీదైన విడాకులు..!

11 January, 2019 - 4:21 PM

ప్రపంచ కుబేరుడైన అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ఇకపై ఆ గుర్తింపును కోల్పోనున్నారు. పాతికేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ భార్య మెకెంజీ నుంచి విడాకులు తీసుకున్నానంటూ జెఫ్‌ బెజోస్‌ షాకింగ్‌ న్యూస్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఓ ప్రముఖ టీవీ యాంకర్‌‌తో ప్రేమలో పడినందువల్లనే బెజోస్‌ తన భార్య నుంచి విడిపోతున్నారంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బెజోస్‌ ప్రస్తుత సంపాదన 137 బిలియన్‌ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి బెజోస్ భరణం రూపంలో తన భార్యకు సుమారు 60-70 బిలియన్‌ డాలర్లు (రూ.42,38,10,00,00,000- నాలుగున్నర లక్షల కోట్లు) చెల్లిస్తారట. దీంతో బెజోస్‌ సంపద సగానికి తగ్గిపోనుంది. ఈ క్రమంలో విడాకుల అనంతరం ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలైన మహిళగా మెకాంజీ నిలుస్తారట.

పాతికేళ్లు భార్యభర్తలుగా మెకెంజీ.. తాను ఎంతో సంతోషంగా జీవించామనీ, విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని బెజోస్‌ తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని ఓ సంయుక్త ప్రకనటలో వారు తెలిపారు.

ఇక రచయిత్రి అయిన మెకెంజీ (48) న్యూయార్క్‌‌లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో 1993లో తొలిసారిగా బెజోస్‌‌ను కలుసుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆరు నెలల తరువాత అదే ఏడాది వారు పెళ్ళి చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు పిల్లలు ఉన్నారు. మెకెంజీ రెండు నవలలు కూడా రాశారు. భర్తే తన రచనలకు మొదటి బెస్ట్‌ రీడర్‌ అని ఆమె చెప్పేవారు. రచనా వ్యాసంగంతో పాటు మెకంజీ బైస్టాండర్‌ రివల్యూషన్‌ (వేధింపులకు వ్యతిరేకంగా) అనే సంస్థను 2014లో ఏర్పాటు చేశారు. 1994లో ఆన్‌‌లైన్ బుక్‌సెల్లర్‌‌గా ఏర్పాటైన అమెజాన్‌ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది.

అమెజాన్ సంస్థను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మెకంజీ తన బిజినెస్‌కు ఎంతో సహకారం అందించారని పలు సందర్భాల్లో జెఫ్ బెజోస్ గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఇటీవలే అమెజాన్‌ అవతరించిన విషయం తెలిసిందే.