ఈ పోకడ కల’కాలమ్’ వర్ధిల్లాలి!

20 November, 2017 - 11:28 PM

♦ మీడియా పల్స్

నచ్చని ధోరణులను విమర్శించడం ఎంత ముఖ్యమో పొడసూపిన మంచి పోకడలను చర్చించి ప్రోత్సహించడం ఇంకా ప్రధానం. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. అది మీడియా విషయమైతే మరీ కీలకం. ఇది చిన్న పత్రికలో జరిగిందా, పెద్ద పత్రికలో వీలయిందా, మధ్య స్థాయిలో సాధ్యపడిందా అన్న విశ్లేషణలు అంత ముఖ్యం కావు.నవంబర్ 15న ‘ద హన్స్ ఇండియా’ పత్రికలో ‘candid comments’ అనే పేరుతో డాక్టర్ కె. నాగేశ్వర్ కాలమ్ ఫొటోతో పాటు కనబడింది. అక్టోబర్ 12న వారు అదే పత్రిక నుంచి సంపాదకులుగా వైదొలిగారు. 14వ తేదీ నుంచి సంపాదకీయం కింద వారి ఫొటో తీసివేశారు. అక్టోబర్ 26 నుంచి వి. రామూశర్మ గారి పేరు ఎడిటర్‌గా ఇంప్రింట్‌లో కనబడడం మొదలయింది. నాగేశ్వర్ గారు వెళ్లిపోయారు గనుక వారి కాలమ్ వస్తుందని ఎవరూ ఆశించలేదు.

సోమవారం కనబడే రామూ శర్మ గారి శీర్షిక ‘in my opinion’ ఒక పేజీ ముందుకు వచ్చి రెండు రోజుల తర్వాత, అంటే బుధవారం, సంపాదకీయ పుటకు మారింది. ఇది కూడా ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. సంపాదకులు మారినపుడు సహజంగా ఇలాంటి మార్పులు చాలా జరుగుతుంటాయి. కానీ తప్పుకున్న సంపాదకుడి శీర్షిక మరలా అదే పేరుతో, అదే పత్రికలో, అదే పేజీలో రావడం మంచి పరిణామం.

ప్రొ. నాగేశ్వర్

ఒక్క తెలుగులోనే కాదు, చాలా భాషలలో సంపాదకులతో సహా చాలా మంది పాత్రికేయులు తమ పత్రిక సర్క్యులేషన్, విశ్వసనీయత, యాజమాన్యం గురించి చాలా ఘనంగా చెప్పుకోవడం, అదే పోటీ పత్రికల దగ్గరకొచ్చే సరికి నాలుక చప్పరించడాన్ని సాధారణంగా గమనిస్తుంటాం. అంతే కాదు, సంపాదకుడు లేదా పైస్థాయి జర్నలిస్టు ఎవరైనా ఓ మీడియా సంస్థ నుంచి తప్పుకుని మరో సంస్థకు వెళ్లారనుకోండి. ఇదివరకటి సంస్థలో జర్నలిస్టులు అతని గురించి తక్కువ చేసి మాట్లాడడం లేదా అగౌరవ పరిచే రీతిలో వదంతులు వ్యాప్తి చేయడం చాలా వరకూ జరుగుతుంది. నిజానికి ఈ మార్పులు పత్రికలలో గానీ ఛానళ్లలో గానీ వార్తలుగా రావు. కేవలం వ్యక్తిగత స్థాయిలో నిందాపూర్వక మాటలు సాగుతుంటాయి.

ఒక రోజులో ఒక వ్యక్తి గానీ, ఆయన ప్రతిభా సామర్ధ్యాలు గానీ ఒక సంస్థ స్వభావం గానీ, విశ్వసనీయత గానీ తిరగబడి పోవు. కానీ తటస్థంగా దూరం నుంచి ఈ పోకడలను గమనిస్తే సంగతి అర్ధం అవుతుంది. చాలా అగౌరవంగా సంపాదకులను సాగనంపడం మనకు తెలుసు. దీనికి ప్రాంతీయ తేడాలు గానీ, భాషా బేధాలు గానీ ఉండవు. పాత్రికేయులు, యాజమాన్యాల స్వభావాలు మామూలుగా ఒకే రకంగా కనబడతాయి.

ఒక పత్రికలో తప్పుకున్న తర్వాత మరో పత్రికలో కాలమ్ ప్రారంభించడం తెలుగులో అడపాదడపా కనబడుతుంది.. 1977లో ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి తప్పుకున్న నార్ల వెంకటేశ్వరరావు గారు కొద్ది నెలల్లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ‘లోకం పోకడ’ అనే శీర్షిక అయిదు నెలల పాటు నిర్వహించారు. యాజమాన్యాల వత్తిడి కారణంగా ఈ శీర్షిక  ఆగిందనే ప్రచారం ఉంది గానీ దానికి ఆధారాలు ఎంతమాత్రం దొరకవు. ఇటీవల ‘వార్త’ దినపత్రిక సంపాదకులుగా వైదొలగిన టంకశాల అశోక్ తక్కువ వ్యవధి లోనే ‘ఆంధ్రభూమి’ దినపత్రికలో కాలమ్ ప్రారంభించారు.

ఒకవేళ వైదొలగినా కొంతకాలం తర్వాత విబేధాలు సద్దుమణిగిన తర్వాత తిరిగి రాసిన సంపాదకుల వృత్తాంతాలు కూడా ఉన్నాయి. ఎబికె ప్రసాద్ ‘ఆంధ్రప్రభ’, ‘వార్త’ దినపత్రికల సంపాదకులుగా పని చేసిన ఎన్నో ఏళ్లకు వాటిలో శీర్షికలు రాశారు. తక్కువ వ్యవధిలో సగౌరవంగా అదే పత్రికలో అదే శీర్షిక పునరాగమనం మాత్రం అపురూపమే. ఇంప్రింట్‌లో పేరు మాయమైన మూడు వారాల లోపు ‘హన్స్ ఇండియా’లో నాగేశ్వర్ శీర్షిక మొదలుకావడం నిజంగా హర్షణీయ పరిణామం.

ఒక సంపాదకుడు ఒక శీర్షిక రాస్తూ ఖ్యాతి గడిస్తాడు. ఆ వ్యక్తి తప్పుకోగానే అదే పత్రికలో అదే శీర్షిక అదే పేజీలో కొనసాగుతుంది. అయితే రచయిత మాత్రం మారతాడు. ఇలాంటి ధోరణికి కూడా ఉదాహరణలు కనబడతాయి. ఇటువంటి ధోరణుల మధ్య ‘హన్స్ ఇండియా’ పరిణామం వెలుతురు రెక్క విప్పడం లాంటిది. యాజమాన్యంతో పేచీ వచ్చి నాగేశ్వర్ వెళ్లిపోయారనీ, కింగ్‌షుక్ నాగ్‌ను టైమ్స్ సంస్థ నుంచి తీసుకువచ్చారనీ, వారిని ఎడిటర్ చేయడానికే నాగేశ్వర్‌ను సాగనంపారనీ ప్రచారాలు జరిగాయి. నిజానికి కింగ్‌షుక్ నాగ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎడిషన్, తెలంగాణలో ఒక ఎడిషన్ రద్దు చేసిన ‘హన్స్ ఇండియా’ న్యూఢిల్లీ నుంచి ఎడిషన్ మొదలుపెట్టింది.

ఏది ఏమైనా తప్పుకున్న ఎడిటర్‌ను నెలలో మరలా శీర్షికా రచయితగా కొనసాగించినందుకు ‘హన్స్ ఇండియా’కు అభినందనలు.

  • – డా. నాగసూరి వేణుగోపాల్

    మీడియా విశ్లేషకులు