మళ్లీ సీఎంగా..

16 February, 2020 - 2:41 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్.. అరవింద్ కేజ్రీవాల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడో సారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినట్లు అయింది. ఆరుగురు ఎమ్మెల్యేలు .. మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్రగౌతమ్ మంత్రులుగా అనిల్ బైజాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ధన్యవాద్ ఢిల్లీ’ పేరుతో ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీని ఆప్ నేతలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలో ఆదివారం మోదీ పర్యటిస్తున్న విషయం విదితమే. కాగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బుల్లి మఫ్లర్ మ్యాన్ ఆవ్యన్ తోమర్ హాజరయ్యారు.

ఇక ఢిల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలతోపాటు ఢిల్లీ అభివృద్ధికి సహకరించిన 50 మందికి ఆప్ నేతలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. వారిలో ఆటో, అంబులెన్స్, బస్సు డైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు, పాఠశాల ప్యూన్లతోపాటు మొహిల్లా క్లినిక్ డాక్టర్లు, విధుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను ఆప్ నేతలు ఆహ్వానించారు.

దీంతో వారంత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారకార్యక్రమానికి దాదాపు 2 వేలమంది పోలీసులతో పిటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం కొత్త మంత్రులతో సీఎం కేజ్రీవాల్ విందు భేటీ అయ్యారు.