ఫలితాలు తరవాత.. పని ముందు!

15 April, 2019 - 4:09 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక, శాసనసభ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న పూర్తయింది. అభ్యర్థులు, ప్రజలు అంతా కూడా మే నెల 23న జరిగే ఓట్ల లెక్కింపు తర్వాత విడుదలయ్యే ఫలితాల కోసం సుమారు 40 రోజుల పాటు వేచి చూడక తప్పనిసరి పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది అభ్యర్థులు హాలిడే ట్రిప్‌న ఎంజాయ్ చేస్తున్నారు. చంద్రబాబు, మరి కొందరు టీడీపీ నేతలైతే ఎన్నికల సంఘం మీద, ఈవీఎంల తీరుపైనా ఫిర్యాదులు చేయడంలోనూ, ప్రతిపక్షం వైఎస్సార్సీపీ మీదా, ప్రధాని మోదీ పైనా ఆరోపణలు చేయడంలోనూ బిజీబిజీగా ఉన్నారు. సీబీఐ జేడీగా అవినీతిని కడిగేసేందుకు ఎలాంటి బెరుకూ లేకుండా పనిచేసిన లక్ష్మీనారాయణ ఇప్పుడు చెత్తాచెదారాన్ని ఏరివేసేందుకు నడుం బిగించారు.

నిజానికి ప్రజా ప్రతినిధిని అని చెప్పుకునే నాయకుడైనా ఏం చేయాలి? ఎన్నికల సమయంలో ఎక్కడలేని సమస్యల్ని ఏకరువు పెట్టి, ఊదరగొట్టేసి, ఎన్నికలయ్యాక ప్రజలను వారి మానాన వార్ని వదిలేయడం కాదు.. సమస్యల పరిష్కారంపై నిజంగా పనిచేయాలి. అప్పడే ఆ నాయకుడు ప్రజల మనసును దోచుకుంటాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. తాను చేయదలచుకున్న సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలి.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల ద్వారా రాజకీయ నాయకుడిగా మారిన మాజీ పోలీస్ అధికారి వీవీ (జేడీ) లక్ష్మీనారాయణ ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారు. పోలింగ్ అయిన మరుసటి రోజు నుంచే కార్యరంగంలోకి దూకేశారు. విశాఖ బీచ్‌లో పేరుకుపోతున్న చెత్తను, చెదారాన్ని ఏరివేసే పనిలో నిమగ్నమయ్యారాయన. సమాజ సేవ చేయాలనే తపన ఉన్న కొందరు మిత్రులు, పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి పోటీ చేసిన ఇద్దరు అసెంబ్లీ అభ్యర్థులు గిరిధర్, ఉషాకిరణ్‌తో కలిసి బీచ్‌ను శుభ్రం చేసే పనిని చేపట్టారు. చేతులకు గౌవ్స్ తొడుక్కుని స్వయంగా చెత్తా చెదారాన్ని ఏరివేశారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 11న పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ ప్రాంతాలు వెళ్ళాలని, వివిధ అంశాలపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నానన్నారు. ఆ క్రమంలో 12వ తేదీ ఉదయం వైజాగ్ హార్బర్‌కు వెళ్ళి మత్స్యకారుల్ని కలిసి, వారి సమస్యలపై సుమారు రెండు గంటలపాటు చర్చించినట్లు చెప్పారు. అక్కడి పరిస్థితుల్ని ఎలా మెరుగుపరచాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. తరువాత రోజున విశాఖ బీచ్‌లో పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టినట్లు తెలిపారు. విశాఖ బీచ్ నగరానికి ఒక ల్యాండ్ మార్క్ లాంటిదని, వైజాగ్ వచ్చిన అనేక మంది తప్పకుండా బీచ్‌ను చూసేందుకు వస్తారన్నారు. బీచ్‌ ఎంత పరిశుభ్రంగా ఉందో పర్యాటకులు గమనిస్తారన్నారు. దాన్ని బట్టి వైజాగ్ పట్టణం పట్ల వారు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారని చెప్పారు.

బీచ్‌లన్నింట్లోనూ చెత్త ఇలాగే ఉంటుందనే అభిప్రాయాన్ని వారిలో కలగకుండా చూసేందుకే తాము చెత్త ఏరివేత కార్యక్రమం చేపట్టామని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. జనసేన అభ్యర్థులు గిరిధర్, ఉషాకిరణ్‌తో పాటు మరెంతో మంది శ్రేయోభిలాషులు బీచ్‌కు వచ్చి చెత్త ఏరివేసే కార్యక్రమంలో హుషారుగా పాల్గొన్నారని చెప్పారు. ముంబైలోని జుహూ బీచ్‌ను ఒక్కో రోజు ఒక్కో కాలేజి విద్యార్థినీ విద్యార్థులు వచ్చి క్లీనింగ్ చేస్తున్న కాన్సెప్ట్‌ను విశాఖకు తీసుకురావాలని తనకు ఉందని చెప్పారు. ఇలా ఒక్కో కాలేజి విద్యార్థులు శుభ్రం చేయాల్సిన టర్న్ నెలకోసారి మాత్రమే వస్తుందన్నారు. దాంతో తమ టర్న్ వచ్చినప్పుడు ఆ కాలేజి విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి జుహూ బీచ్‌ను క్లీన్ చేస్తారని చెప్పారు. దీంతో జుహూ బీచ్ ఏ రోజు చూసినా పరిశుభ్రంగా, నీట్‌గా ఉంటుందని అన్నారు.

ప్రజల్లో కూడా బీచ్ శుభ్రత గురించి అవగాహన కల్పించడం కూడా తమ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని లక్ష్మీనారాయణ వెల్లడించారు. విశాఖ బీచ్‌ను శుభ్రం చేస్తున్నప్పుడు తమకు ప్లాస్టిక్ స్పూన్లు అధిక సంఖ్యలో దొరికాయని, క్యాన్సర్ కారకమైన ఈ స్పూన్ల వినియోగించే పర్యటకులకు, వాటిని తెచ్చి సందర్శకులకు ఇస్తున్న చిరు వ్యాపారులకు వాటిని అరికట్టే విషయంలో అవగాహన కల్పించాలని అన్నారు. పరిసరాలు స్వచ్ఛంగా ఉంటే.. మన ఆరోగ్యం బాగుంటుందని, ఆరోగ్యం బాగుంటే.. మన ఆలోచనలు బాగుంటాయని.. ఆలోచనలు బాగుంటే.. ఆశయాలు బాగుంటాయని లక్ష్మీనారాయణ వివరించారు. శభాష్ జేడీ..! దటీజ్ లక్ష్మీనారాయణ..!