శివాలయంలో ఇఫ్తార్, నమాజ్!

11 June, 2018 - 12:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

లక్నో: దేశంలో మత ఘర్షణలు తీవ్రంగా పెరిగిపోతున్నాయంటూ తరచుగా వార్తలు వస్తోన్న ఈ రోజుల్లో… హిందువుల ఆరాధ్య దైవం మహాశివుడు కొలువైన ఓ ఆలయంలో ఇఫ్తార్ విందు‌, హారతి ప్రదేశంలో నమాజ్‌ .. ఇలాంటివి ఊహకు కూడా అసాధ్యమే. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మహిళా పూజారి దేవ్యగిరి. లక్నోలోని వెయ్యేళ్ల చరిత్ర గల శివాలయంలో పూజారిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళ దేవ్యగిరి‌. మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఆమె చేసిన కార్యక్రమం ఇప్పుడు అందరి మన్ననలూ పొందుతోంది.

ఉత్తరప్రదేశ్‌‌లోని గోమతినది ఒడ్డున అతి పురాతన మంకమేశ్వర్‌ గుడి ఉంది. అక్కడ ప్రధాన అర్చకురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహంత్‌ దేవ్యగిరిగా మారారు అరుణిమా సింగ్‌. ఏ మతమైనా మనుషులను ప్రేమించమని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించమని మాత్రమే చెబుతుందనే ఆమె నమ్మకాన్ని ఆచరించి చూపాలనుకున్నారు. అందుకోసం వెయ్యేళ్ల ప్రాశస్త్యం ఉన్న శివాలయంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. హారతి స్థలంలో ముస్లిం సోదరులు నమాజ్‌ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేశారు.‘మంకమేశ్వర్‌ ఆలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు సుమారు 500 మంది సున్ని, షియా ముస్లింలను ఆహ్వానించాం. విందు ఏర్పాట్ల కోసం ముగ్గురు వంటవారు, గుడిలో పనిచేసే కార్యకర్తలు ఉదయం నుంచే ఎంతో కష్టపడ్డారు. ముస్లిం సోదరుల కోసం మొదటిసారిగా మేం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. లక్నోలో ఒక ఆలయంలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయడమనేది మొదటిసారి. ఇలాంటి కార్యక్రమానికి నాందిగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది’ అని దేవ్యగిరి హర్షం వ్యక్తం చేశారు.

ఇఫ్తార్‌ విందుకు హాజరైన తేలీ వలీ మసీదు మౌలానా ఫజల్‌-ఈ-మనన్‌ మాట్లాడుతూ.. ‘మహంత్‌ దేవ్యగిరి శివాలయంలో విందు ఏర్పాటు చేస్తున్నామని నన్ను ఆహ్వానించినపుడు ఎంతో సంతోషంగా అనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. ఆమె నిర్ణయాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం’ అని సంతోషం వ్యక్తం చేశారు.