ఏపీ టెకీ అమెరికాలో మృతి

02 November, 2019 - 3:31 AM

(న్యూవేవ్స్ డెస్క్)

వాషింగ్టన్: గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్ జాబితాలో ఉన్న తెలుగు టెకీని మృత్యువు అకాలంగా కబళించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివ చలపతిరాజు మంగళవారం మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. శివ అకాల మరణంతో గర్భవతిగా ఉన్న అతని భార్య సౌజన్య అర్ధంతరంగా స్వదేశానికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. శివ చలపతిరాజు నార్త్ కరోలినాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. అయితే.. శివ మృతికి కారణం ఏమిటనే వివరాలు తెలియడంలేదు.

శివ చలపతిరాజు ఫేస్‌బుక్ వివరాల ప్రకారం గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ప్రస్తుతం శివ కుటుంబం అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఉద్దేశించిన గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తు బ్యాక్‌లాగ్ జాబితాలో ఉంది. రాజమండ్రిలో విద్యాభ్యాసం చేసిన శివ కొన్నేళ్ళుగా నార్త్ కరోలినాలో నివాసం ఉంటున్నారు. పలు కంపెనీల్లో ఆయన పనిచేశారు.

శివ మృతిపట్ల అమెరికాలోని తెలుగు సంఘాలు స్పందించాయి. ఆయన పార్థివదేహాన్ని స్వదేశం తరలించి, అంత్యక్రియలు నిర్వహించేందుకు కావాల్సిన మొత్తాన్ని సమకూర్చేందుకు పీడిమాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ (పాటా) ‘గోఫండ్‌మీ’ ద్వారా విరాళాలు సేకరిస్తోంది.