ఇంటర్ వరకూ తెలుగు భాష తప్పనిసరి

12 September, 2017 - 10:02 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లోనూ ఒకటవ తరగతి నుంచి 12 వరకూ తెలుగు భాషను కచ్చితంగా ఒక సెబ్జెక్టుగా బోధించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల బోర్డులను తప్పనిసరిగా తెలుగులోనే రాయాలని పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై మంగళవారంనాడు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష పరిరక్షణ కోసం పలు కీలక నిర్ణయాలను ఆయన ప్రకటించారు. డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్నాయి.

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ కోసం రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సాహిత్య అకాడమీకి రూ. 5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ. 2 కోట్లు నిర్వహణ ఖర్చుల కింద మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు రాష్ట్ర సాహిత్య అకాడమీని నోడల్ ఏజెన్సీగా బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నందున్న తెలుగు భాషను పరిరక్షించడం కోసం సీఎం రెండు కీలక నిర్ణయాలు కూడా ప్రకటించారు.

తెలుగును కచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో ఇకపై అనుమతి ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉర్దూ కోరుకునే విద్యార్థులకు అది కూడా ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండొచ్చన్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ రూపకల్పన చేయాలన్నారు. సిలబస్ రూపొందించి వెంటనే పుస్తకాలు ముద్రించాలని తెలిపారు. సాహిత్య అకాడమీ రూపొందించిన ఈ సిలబస్‌‌నే అన్ని పాఠశాలల్లో బోధించాలన్నారు. ఇకపై ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా, కచ్చితంగా వ్యవహరించనున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని సంస్థల బోర్డులపైన పేర్లను స్పష్టంగా తెలుగులోనే రాయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమన్నారు. ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

దేశ విదేశాల్లోని అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ అన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలకు ప్రభుత్వం తరుపున ఆహ్వానాలు పంపాలన్నారు. తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందజేయాలన్నారు.

డాక్టర్ సి. నారాయణరెడ్డి స్మారక మందిరాన్ని హైదరాబాద్ నగరంలో నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండు మూడు రోజుల్లోనే స్థలం ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. తెలంగాణ జీవన చిత్రాన్ని, మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించే బతుకమ్మ నేపథ్యాన్ని వివరించే కళారూపాలు ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శించాలన్నారు.