సాహిత్య గౌరవం పొందిన పాత్రికేయులు

02 January, 2018 - 8:07 PM

♦ మీడియా పల్స్

తెలుగు జర్నలిజానికి సంబంధించి ఇది ఒక అపురూప సందర్భం. పాత్రికేయుడు, కవి, అనువాదకుడు, ‘రన్నింగ్ కామెంట్రీ’ కర్త దేవీప్రియకు ‘గాలిరంగు’ కవితా సంపుటి రచనకు గాను 2017 సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని గత వారం ప్రకటించారు. సంపాదకుడు, పాత్రికేయుడు, రచయిత, అనువాదకుడు టంకశాల అశోక్ 2016 సాహిత్యఅకాడెమీ తెలుగు అనువాద పురస్కారాన్ని డిసెంబర్ 29న స్వీకరించారు. పత్రికలయినా, రేడియో, టెలివిజన్‌లైనా జర్నలిజం మౌలికంగా రచనకు సంబంధించినదే కనుక జర్నలిస్టులు రచయితలవడం సాధారణం. మరి ఇప్పుడు దేవిప్రియ, టంకశాల అశోక్ గురించి ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అన్న ప్రశ్న రావచ్చు. పాత్రికేయంలో వస్తువు ప్రధానం, సమాచార ప్రసారం కీలకం. ఇందులో శిల్పచాతుర్యం, భాషా ప్రావీణ్యం అంత ప్రధానం కాదు. అయితే ఈ జర్నలిజం దినుసుతో పాటు అదనంగా ఉంటే రచన మరింత కాలం మన్నుతుంది., ఆ జర్నలిస్టు సాహిత్యకారుడిగా గుర్తింపు పొందుతాడు. తెలుగు జర్నలిజంలో అలాంటి మహానుభావులు పలువురు లేకపోలేదు.

ముట్నూరి కృష్ణారావు రచనలు తాత్విక లోతులను స్పృశిస్తూ సాగేవి. తాపీ ధర్మారావు గారి రచనలు సామాజిక శాస్త్రాల అధ్యయనంగా సాగి వాడుక భాషకు ఆయువు పట్టుగా భాసించాయి. నార్ల వెంకటేశ్వర రావు గారి రచనలు గొప్ప వ్యాసాలు, గొప్ప ఏకాంకికలు, గొప్ప వాక్యానికి ప్రతీకలే కాక ఆలోచనాత్మకంగానూ, పరిశోధనాత్మకంగానూ సాగేవి. విద్వాన్ విశ్వం గారి కవిత్వం, అనువాదం, వచనం విలక్షణంగా నడిచి శాశ్వత కీర్తి పొందాయి. గోరా శాస్త్రి గారి రేడియో నాటికలు, వచనం విశేషమైన విలువ గలవి.

అడవి బాపిరాజు గొప్ప నవలాకారుడు మాత్రమే కాదు, పండిత ఉద్దండులు పలువురు సహోద్యోగులుగా ఉన్నపుడు డైలీ సీరియల్స్ రాసిన రచయిత. నిరాడంబరమైన వచనాన్ని ప్రతిభావంతంగా, ప్రభావ వంతంగా రాసి కథ, నవలా ప్రక్రియలో విశేషమైన కీర్తి గడించిన కొడవటిగంటి కుటుంబరావు ఆంధ్రపత్రిక, చందమామలో సంపాదకుడిగా చేసిన సేవలు అమూల్యం.

నండూరి రామమోహనరావు సరళమైన భాషలో విజ్ఞానాన్ని, తత్వ శాస్త్రాన్ని తెలుగువారికి పరిచయం చేశారు. ఆలూరి బైరాగి తెలుగులో ఎంత గొప్ప కవో, హిందీ బాల సాహిత్యంలో అంత పెద్ద సంపాదకులు. ఆంద్రపత్రిక, భారతిలో చిరకాలం కీలక స్థానాలలో ఉద్యోగం చేసిన సంస్కృతాంధ్ర, ప్రాకృత భాషా పండితుడు తిరుమల రామచంద్ర పరిశోధకుడిగా వెలువరించిన రచనలు అమూల్యమైనవి. వారపత్రికను సాహిత్య పత్రికగా వెలిగించిన పురాణం సుబ్రహ్మణ్య శర్మ అంతర్జాతీయ స్థాయి పొందిన తెలుగు కథకుడు. గజ్జెల మల్లారెడ్డి, అజంతా, త్రిపురనేని శ్రీనివాస్ కవులుగా సుప్రసిధ్దులు.

ఈ కోవలో రాదగినవారు కొందరే ఉంటారు. వృత్తి రీత్యా జర్నలిస్టులయినా ఏదో ఒక సాహిత్య ప్రక్రియలో విశేష పరిశ్రమ చేసిన ప్రతిభావంతులు వీరు. కథకుడిగా శ్రీరమణ, కవిగా జి. శ్రీరామమూర్తి, సాహిత్య విమర్శకుడిగా కల్లూరి భాస్కరం ప్రసిద్ధులు. శ్రీరమణ గారికి కొంత గుర్తింపు ఉంది గానీ శ్రీరామమూర్తి గారి కవితకు మరికొంత ప్రాచుర్యం రావాల్సి ఉంది. నిజంగా వీరు రాసే కవితలు వర్తమాన ప్రపంచాన్ని వ్యంగ్యంగా పరిహసిస్తూ బలంగా ప్రశ్నిస్తాయి.

జనధర్మ, ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త, హన్స్ ఇండియా పత్రికలలో పని చేసిన టంకశాల అశోక్ ఇటీవల చాలా శీఘ్రంగా పలు అనువాద రచనలు చేశారు. వీటిలో వస్తు పరమైన విస్తృతి చాలా ఉంది. ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో వర్తమాన పోకడలపై చిరుకవితలతో ఆకర్షించిన దేవీప్రియ స్థూలంగా కవి. సంపాదకులుగా తక్కువ కాలం చేసినా విభిన్నమైన కృషి విలక్షంగా చేసిన వారు. వారిద్దరికీ సాహిత్య అకాడెమీ పురస్కారాలు రావడం జర్నలిజానికి గర్వకారణం. మనకు ఆనందదాయకం. కృషి చేసినా గుర్తింపు రాని సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో జర్నలిజంలో జీతాలు, గుర్తింపు, పురస్కారాలు బాగా పెరిగాయి.

విద్వాన్ విశ్వం గారి ‘పెన్నేటి పాట’కు సాహిత్య అకాడెమీ అవార్డు రాలేదని దేవులపల్లి కృష్ణశాస్త్రి పలుసార్లు పేర్కొన్నారు. నార్ల వెంకటేశ్వరరావు పరిశోధనాత్మక నాటిక ‘సీత జోస్యం’ రచనకు మూడున్నర దశాబ్దాల క్రితం అవార్డు ప్రకటించినా, వారు తిరస్కరించారు. కొడవటిగంటి కుటుంబరావు గారికి అకాడెమీ ఆవార్డు వచ్చిందే లేదో పరిశీలించాలి. తిరుమల రామచంద్ర ఆత్మకథ ‘హంపీ నుంచి హరప్పా దాకా’ కు అకాడెమీ అవార్డు లభించింది. ఈ లెక్కన చూస్తే టంకశాల అశోక్, దేవీప్రియ గార్లు ప్రతిభావంతులే కాదు, అదృష్టవంతులు కూడా.

  • – నాగసూరి వేణుగోపాల్ 
    మీడియా విశ్లేషకులు