హోరా హోరీ పోరు… సర్వం సిద్ధం

06 December, 2018 - 5:03 PM

 

(న్యూవేవ్స్ డెస్క్)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే వివిధ పార్టీల అభ్యర్థుల సాగించిన ప్రచార పర్వం బుధవారం సాయంత్రంతో ముగిసింది. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరుగుతుండగా… అభ్యర్థుల భవితవ్యం డిసెంబర్ 11న తేలనుంది.

తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా…. వాటిలో 88 స్థానాలు జనరల్, 19 స్థానాలు షెడ్యూల్ కులాలు, 12 స్థానాలు షెడ్యూల్ తెగలకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మొత్తం 1,821 మంది అభ్యర్థుల ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 32,815 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు.. తమ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా… బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గం శేరిలింగంపల్లి కాగా… అతి తక్కవ ఓటర్లు కల్గిన నియోజకవర్గం భద్రాచలం.

టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగగా.. కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐ కలసి మహాకూటమిగా అవతరించాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూడిగాలి పర్యటన చేశారు.

అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ప్రచారాన్ని హోరెత్తించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తెలంగాణ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేశారు.

ఎన్నికల బరిలో దిగిన ముఖ్యులు గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి కేసీఆర్ , సిరిసిల్ల నుంచి ఆయన తనయుడు కేటీఆర్ , సిద్ధిపేట నుంచి హరీశ్ రావు, భూపాలపల్లి నుంచి స్పీకర్ ఎస్ మధుసూధనాచారి, మెదక్ నుంచి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, హుజూరాబాద్ ఈటల రాజేందర్ ఉన్నారు.

హుజూర్ నగర్ నుంచి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జునసాగర్ నుంచి కె జానారెడ్డి, కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు.

ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య హుస్నాబాద్ నుంచి సీపీఐ నాయకుడు చాడా వెంకట్ రెడ్డి తదితర అతిరథ మహారధులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఎన్నికల బరిలో లేరు. కానీ ప్రచారాన్ని మాత్రం వీరిద్దరు తీవ్ర స్థాయికి తీసుకువెళ్లారు.

దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నువ్వా.. నేనా అన్నట్లు మంచి రసవత్తరంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రపంచంలోని తెలుగు ప్రజలే కాదు.. యావత్తు దేశం ఆసక్తిగా గమనిస్తుంది. మరీ తెలంగాణ అధికార పీఠం ఎవరికీ దక్కుతుంది అనేది మాత్రం డిసెంబర్ 11వ తేదీన మధ్యాహ్నానికే తెలిపోనుంది.