తెలంగాణ టీడీపీ నేతల హౌస్ అరెస్ట్!

12 January, 2018 - 1:28 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలను శుక్రవారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణను అరెస్టు చేసిన పోలీసులు.. పొలిట్ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇళ్ల వద్ద భారీగా మోహరించారు. సీనియర్ నేతలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఎంఎన్ శ్రీనివాస్ ఇళ్ల వద్ద సైతం పోలీసులను మోహరించారు.

తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు ఒంటేరు ప్రతాపరెడ్డి అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతలు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణను అరెస్టుచేసి.. ఇతర నేతల ఇళ్ల వద్ద మోహరించారు. మరికొందరు నేతలను సైతం అరెస్టు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కాగా, దాదాపు నెల రోజులుగా అజ్ఞాతంలో ఉన్న  తెలుగు రైతు అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డిని జనవరి 9న నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఆందోళన కేసులో వంటేరు నిందితుడిగా ఉన్నారు. ప్రతాప్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్‌లోనే ఆయన నిరాహార దీక్షకు దిగారు. కాగా, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదని ఆయన అనుచరులు పేర్కొన్నారు.