తెలంగాణ తాజా స్థితిపై కేంద్రానికి రిపోర్ట్

16 October, 2019 - 6:04 AM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం, తాజా పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్‌ తమిళిసై నివేదించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ వెళ్లిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగడం, ఆత్మహత్యలు చేసుకుంటుండటం.. బస్సుల్లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై కేంద్రం నివేదిక కోరిందని సమాచారం.

ఈ నేపథ్యంలో.. తమిళిసై ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. పైగా తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా తమిళిసై ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం, సమ్మెపై ప్రభుత్వ, ప్రజా, రాజకీయ వర్గాల వైఖరి, ప్రభుత్వ ప్రత్యామ్నాయ చర్యలు సహా పలు అంశాలపై ప్రధానికి నివేదించినట్లు తెలుస్తోంది.

తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ఆయన నివాసంలో కలసిన గవర్నర్‌ తమిళిసై.. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితులపై వివరించారు. ప్రధాని, కేంద్ర హోం మంత్రితో భేటీ సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ప్లాస్టిక్‌పై నిషేధం, యోగా తరగతులు, రెడ్‌క్రాస్‌ సొసైటీతో కలసి రక్తదాన శిబిరాల ఏర్పాటు వివరాలు కూడా గవర్నర్‌ తెలిపినట్లు రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. వాటితో పాటుగా బతుకమ్మ సంబరాలపై ప్రతులను కూడా అమిత్ షాకు అందించారు. తమిళిసైని ప్రధాని మోదీ అభినందించారు.