ఏపీ సీఎంకి ‘భట్టి’ బహిరంగ లేఖ

16 June, 2019 - 3:40 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వస్తే మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆత్మక్షోభిస్తోందని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అంతేకాదు… ఈ ప్రాజెక్టు డిజైన్‌లో మార్పు వెనక ఈ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని.. వాటికి మీరు పరోక్షంగా బాధ్యులు అవుతారని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఏపీ సీఎం వైయస్ జగన్‌కి మల్లు భట్టివిక్రమార్క బహిరంగ లేఖ రాశారు.

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైయస్ఆర్ .. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఆ సమయంలో ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 38 వేల కోట్లు ఉందని…. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు…. అనంతరం రాష్ట్ర విభజన జరగడం.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని ఆయన ఈ లేఖలో గుర్తు చేశారు.

టీఆర్ఎస్ పాలనలో రీడిజైనింగ్ పేరుతో ఈ ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేశారని…. అలాగే దీని అంచనా వ్యయం రూ. లక్ష కోట్లుకు పెంచడం జరిగింది చెప్పారు. దీంతో ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయిందని మల్లు భట్టివిక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మీరు… ఈ ప్రాజెక్టు ప్రారంభానికి వస్తే.. మీ తండ్రి వైయస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్ ‌జగన్‌కి ఈ లేఖలో మల్లు భట్టివిక్రమార్క అభినందనలు తెలిపారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులు జోరుగా జరుగుతున్నాయని వైయస్ జగన్‌కి ఈ లేఖలో మల్లు గుర్తు చేశారు. అయితే మీరు.. అసెంబ్లీ తొలి సమావేశాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మీరు మాట్లాడిన పద్దతి నచ్చిందంటూ వైయస్ జగన్‌కి మల్లు కితాబు ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ 21న ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, సీఎం ఫడణవీస్‌ను ఇప్పటికే సీఎం కేసీఆర్ ముంబయి వెళ్లి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అలాగే ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి‌ని కూడా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. ఈ నేపథ్యంలో వైయస్ జగన్‌కి టీసీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లేఖ రాశారు.