టీమిండియా ఐర్లాండ్ టూర్ ఖరారు

10 January, 2018 - 6:12 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబయి: భారత క్రికెట్‌ జట్టు ఐర్లాండ్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌ కంటే ముందుగానే టీమిండియా ఐర్లాండ్‌‌తో రెండు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు టీ20లు కూడా డబ్లిన్‌ వేదికగా జరగనున్నాయి. జూన్ 27న తొలి టీ20, 29న రెండో టీ20 మ్యాచ్ జరగనుందని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది.

జూలైలో భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. దీనికి కొన్ని రోజుల ముందు టీమిండియా ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ ఆడనుంది. పొట్టి ఫార్మాట్‌లో ఇప్పటి వరకు భారత్‌, ఐర్లాండ్ మధ్య కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ జరిగింది. 2009 ఐసీసీ టీ20 ప్రపంచ‌కప్‌లో భాగంగా నాటింగ్‌హామ్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ తర్వాత దాదాపు 9 ఏళ్లకు మరోసారి ఎదురపడనున్నాయి.

ప్రస్తుతం కోహ్లీ సేన దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. దక్షిణాఫ్రికాతో 3 టెస్టులు, 6 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడనుంది. కేప్‌టౌన్‌‌లోని న్యూలాండ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టులోనైనా భోణి కొట్టాలని కోహ్లీసేన భావిస్తోంది.