335 రన్స్‌కు దక్షిణాఫ్రికా ఆలౌట్

14 January, 2018 - 4:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సెంచూరియన్‌: ఆతిథ్య దక్షిణాఫ్రికా- పర్యాటక భారత్ జట్ల మధ్య సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆటలో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌‌లో దక్షిణాఫ్రికా 335 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్ నైట్ స్కోరు 269/6తో సఫారీ జట్టు రెండో రోజు ఆదివారం ఆట ప్రారంభించింది. టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ విజృంభించి విసిరిన బంతుల్ని ఎదుర్కోవడంలో తడబడిన సఫారీలు 113.5 ఓవర్లకు ఆలౌటయ్యారు. ఓవర్ నైట్ స్కోరుకు సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ 66 పరుగులు జోడించి, మిగతా నాలుగు వికెట్లు కోల్పోవడంతో తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

రెండో రోజు ఆటలో ఓవర్‌‌నైట్‌ బ్యాట్స్‌మన్ మహరాజ్‌ (18) ఆదిలోనే పెవిలియన్‌‌కు చేరాడు. మొహ్మద్‌ షమీ బౌలింగ్‌‌లో మహరాజ్‌ అవుటయ్యాడు. ఆపై రబడా- డు ప్లెసిస్‌ జోడి కాసేపు భారత బౌలింగ్‌‌ను ప్రతిఘటించింది. ఈ జోడి 42 పరుగులు జత చేసిన తర్వాత రబడా (11) ఎనిమిదో వికెట్‌‌గా పెవిలియన్‌ చేరాడు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌‌లో రబడా ఇచ్చిన క్యాచ్‌‌ను హార్దిక్‌ పాండ్యా అద్భుతంగా పట్టుకున్నాడు. ఫార్వర్డ్‌ లెగ్‌ నుంచి డీప్‌ స్క్వేర్‌ లెగ్‌ వైపు పరుగెత్తుకుంటూ వచ్చిన పాండ్యా క్యాచ్‌‌ను డైవ్‌ కొట్టి మరీ పట్టుకున్నాడు. ఆ తరువాత డు ప్లెసిస్‌ (63)ను ఇషాంత్‌ శర్మ బౌల్డ్‌ చేశాడు. ఇక ఆఖరి వికెట్‌‌గా మోర్కెల్‌ (6) పెవిలియన్‌ చేరాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌‌లో మురళీ విజయ్‌‌కు క్యాచ్‌ ఇచ్చి మోర్కెల్‌ అవుటయ్యాడు. ఒక దశలో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా జట్టు చివరిలో వరుసగా వికెట్లను చేజార్చుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ అశ్విన్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇషాంత్‌ శర్మ మూడు వికెట్లు తీశాడు. షమీకి ఒక వికెట్‌ లభించింది.

దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో మర్క్రమ్ 94, ఆమ్లా 82, డు ప్లెసిస్ 63, ఎల్గార్ 31, డివిలియర్స్ 20 పరుగులు చేశారు. క్వింటన్ డి కాక్, వెర్మన్ ఫిలాండర్ పరుగులేవీ చేయలేకపోయారు.