రికార్డును టీమిండియా తిరగరాస్తుందా?

22 August, 2019 - 7:37 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ఆంటిగ్వా (వెస్ట్ ఇండీస్): టెస్ట్ మ్యాచ్‌ల ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ జట్టును టీమిండియా 2002 నుంచీ మట్టికరిపిస్తూనే ఉంది. ఇరు జట్లూ 23 టెస్టు సీరీస్‌లలో తలపడగా విండీస్‌ 12, భారత్ 9 సార్లు సీరీస్‌ను కైవసం చేసుకున్నాయి. అయితే.. గడచిన 17 సంవత్సరాలుగా విండీస్ చేతిలో భారత్‌ ఒక్క టెస్టు సీరీస్‌ను కూడా కోల్పోలేదు. గురువారం నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్ట్‌ల సీరీస్‌ను కూడా టీమిండియా తన ఖాతాలో వేసుకుంటే వెస్టిండీస్‌పై 17 ఏళ్లుగా విజయపరంపర కొనసాగిస్తున్న జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికే భారత్‌ టీ20, వన్డేల సీరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. టెస్టు చాంపియన్‌షిప్‌ ఈ సీరీస్‌తోనే మొదలవడంతో ఇరుజట్లకూ ఇది ఎంతో కీలకంగా మారనుంది.

విండీస్‌తో జరిగే టెస్టు సీరీస్‌ను భారతజట్టు గెలిస్తే కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సీరీస్‌ను గెలిచిన తొలి భారతజట్టు సారథిగా రికార్డు సృష్టిస్తాడు. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సీరీస్‌లో కోహ్లీసేన 2-0తో సీరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా.. ధోనీ రికార్డుపై కూడా కోహ్లీ కన్నేశాడు. టెస్టుల్లో ధోని 60 మ్యాచ్‌ల్లో 27 మ్యాచ్‌లు విజయం సాధించగా కోహ్లీ 46 మ్యాచ్‌ల్లోనే 26 మ్యాచ్‌లు గెలిచాడు. మరో మ్యాచ్‌ గెలిస్తే  ధోనీ రికార్డును ఈ రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ సమం చేస్తాడు.

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సీరీస్‌లో భాగంగా కోహ్లీ సేన గురువారం ఆంటిగ్వాలో తొలి టెస్టు ఆడనుంది.