కొత్త లుక్‌లో కోహ్లీ సేన!

12 January, 2018 - 2:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సెంచూరియన్‌: భారత క్రికెట్ జట్టు కోహ్లీ సేన కొత్త లుక్‌లో కనువిందు చేశారు. జోహన్నెస్‌‌బర్గ్‌‌లోని ఇండియా హౌస్‌‌‌ను టీమిండియా సందర్శించిన సందర్భంగా కొత్త గెటప్‌లో కనిపించారు. దక్షిణాఫ్రికాతో టెస్టు, వన్డే, టీ 20 సీరీస్‌‌లు ఆడేందుకు ఇప్పుడు టీమిండియా సఫారీ గడ్డపై పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్‌- దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు శనివారంనాడు సెంచూరియన్‌లో మొదలు కానుంది. సెంచూరియన్‌‌లోని స్పోర్ట్ పార్క్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది.

కేప్‌‌టౌన్‌‌ జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఆతిథ్య జట్టుకు జారవిడుచుకున్న అనంతరం అక్కడి నుంచి టీమిండియా జోహన్నెస్‌‌బర్గ్‌ చేరుకుంది. కాగా.. గురువారం ఉదయం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌‌‌లో భారత క్రికెటర్లు పాల్గొన్నారు. అనంతరం ఇండియా హౌస్‌ సిబ్బంది ఆహ్వానం మేరకు జోహన్నెస్‌‌బర్గ్‌లోని కార్యాలయానికి టీమిండియా ఆటగాళ్లు, జట్టు మేనేజ్‌‌మెంట్‌ వెళ్లి ప్రత్యేక విందులో పాల్గొంది.

ఈ సందర్భంగా పలువురు భారతీయులు టీమిండియా బృందంతో కలిసి ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. కోహ్లీ సేన ఇండియా హౌస్‌‌ను సందర్శించిన ఫొటోలను బీసీసీఐ ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసింది. శిఖర్‌ ధావన్‌ కూడా ఓ ఫొటోను తన ట్విట్టర్‌‌లో పెట్టాడు. ‘జోహెన్నెస్‌‌బర్గ్‌‌లోని హై కమిషన్‌ కార్యాలయాన్ని అందరం కలిసి సందర్శించాం. కొత్త దుస్తుల్లో ఆటగాళ్లను చూడటం ఆనందంగా ఉంది’ అని అందులో రాశాడు.