లంకేయుల మనసు దోచిన రోహిత్!

20 March, 2018 - 3:22 PM

(న్యూవేవ్స్ డెస్క్)

కొలంబో: టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌‌శర్మ అభిమానుల మనసుల్ని మరోసారి గెలుచుకున్నాడు. భారతదేశ అభిమానులతో పాటు లంకేయుల మనసు కూడా దోచుకోవడం విశేషం. ఈ ఏడాది లంక 70 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌-బంగ్లాదేశ్‌- శ్రీలంక మధ్య ఆ దేశ బోర్డు ముక్కోణపు టీ 20 టోర్నీ నిర్వహించింది. ఆదివారం బంగ్లాదేశ్‌‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా గెలిచి ముక్కోణపు ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్‌ అయిన తరువాత భారత ఆటగాళ్లు మైదానంలో కలియ తిరిగారు. సాధారణంగా ఈ సమయంలో విజయం సాధించిన ఏ జట్టు ఆటగాళ్లయినా తమ దేశ జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని తిరగడం ఆనవాయితా. కానీ.. ఆదివారం రోహిత్‌‌శర్మ శ్రీలంక జాతీయ పతాకాన్ని పట్టుకుని మైదానంలో తిరిగాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. శ్రీలంక జాతీయ జెండాను పట్టుకుని తిరగడం ద్వారా రోహిత్ ఇటు భారత్‌, అటు లంకేయుల మనసుల్ని గెలుచుకున్నాడు‌. ‘బ్యూటీ ఆఫ్‌ క్రికెట్‌, లంక జెండాతో రోహిత్‌ శర్మ’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెద్ద ఎత్తున పెడుతున్నారు.

చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఫైనల్‌ పోరులో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతికి దినేశ్‌ కార్తీక్‌ సిక్స్‌ కొట్టడం ద్వారా భారత్‌‌కు ఈ ముక్కోణపు ట్రోఫీ లభించింది.