భారత ఫుట్‌బాల్ జట్టుకు కోహ్లీ సపోర్ట్

03 June, 2018 - 3:42 PM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: ‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ స్టేడియానికి వచ్చి మేం ఆడే ఫుట్‌‌బాల్ మ్యాచ్‌‌లు ప్రత్యక్షంగా చూడండి’ అని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి శనివారం ఆవేదనతో పిలుపుచ్చిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. సునీల్‌ ఛెత్రి పిలుపునకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స్పందించాడు. భారత ఫుట్‌‌బాల్‌ జట్టుకు మద్దతు ప్రకటించాడు. జట్టును ప్రోత్సహించాలని అభిమానులను కోహ్లీ ట్విటర్‌‌లో హృదయ పూర్వకంగా కోరాడు.

‘నా స్నేహితుడు, భారత ఫుట్‌‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి పెట్టిన పోస్ట్‌‌ను చూడండి… దేశంలో ఫుట్‌‌బాల్‌‌కు మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నించండి. భారత్‌ ఆడే మ్యాచ్‌‌లను తిలకించేందుకు వెళ్లా’లని అభిమానులను కోరాడు. స్టేడియంలకు వెళ్లి భారత్‌ ఆడే మ్యాచ్‌‌లను లైవ్‌‌లో చూడటం ద్వారా దేశంలో క్రీడల సంస్కృతిని పెంపొందించవచ్చని కోహ్లీ తెలిపాడు.

భారత్‌ ఫుట్‌‌బాల్‌ కెప్టెన్‌ ఛెత్రి ట్విటర్‌ వేదికగా శనివారం ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆటతీరులో మెరుగుపడి ఫిఫా ర్యాంకింగ్స్‌‌లో ప్రస్తుతం 97వ స్థానంలో ఉన్న భారత ఫుట్‌‌బాల్‌ జట్టు శుక్రవారం మొదలైన నాలుగు దేశాల టోర్నీ ఆరంభ మ్యాచ్‌‌లో 5-0 తేడాతో చైనీస్‌ తైపీపై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌‌కు కేవలం 2569 మంది అభిమానులు మాత్రమే హాజరవడంతో ముంబైలోని ఫుట్‌‌బాల్‌ ఎరీనా స్టేడియం బోసిపోయి కనిపించింది. ఛెత్రి అద్భుతంగా రాణించి హ్యాట్రిక్‌‌తో జట్టుకు విజయాన్ని అందించినా అతడిలో ఆనందం కనిపించలేదు. ఈ క్రమంలో ఛెత్రి తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.