అది వదంతి అనుకున్నా..!

07 May, 2018 - 2:35 PM

(న్యూవేవ్స్ డెస్క్)

పుణె: అండర్‌-19 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ గెలిచిన నాటి నుంచి జాతీయ జట్టు పగ్గాలు చేపట్టే వరకూ విరాట్‌ కోహ్లీ అంచెలంచెలుగా ఎదిగిన క్రమం తెలిసిందే. ఎవరికీ సాధ్యం కాని విధంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ రికార్డులను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ.. విరాట్ కోహ్లీ ముందుకు సాగుతూనే ఉన్నాడు. ప్రపంచంలో ఎలాంటి బౌలర్‌‌నైనా సులభంగా ఎదుర్కొనే సత్తా ఉన్న బ్యాట్స్‌మన్ కోహ్లీ అనడం అతిశయోక్తి కాకే కాదు. మైదానంలో నిత్యం దూకుడుగా కనిపించే కోహ్లీ ఆట పట్ల అదే స్థాయిలో అంకితభావం ప్రదర్శించేందుకు పాటుపడుతుంటాడు. ఆ దూకుడుతోనే పదేళ్లుగా ప్రతి మ్యాచ్‌‌లోనూ నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వడానికే ప్రాధాన్యతనిస్తాడు.

అలాంటి కోహ్లీ తొలిసారిగా జాతీయ జట్టుకు ఎంపికైన విషయాన్ని వదంతి అనుకున్నాడట. ఓ ప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఈ విషయం చెప్పాడు. ‘జాతీయ జట్టుకు ఎంపికైన ఆటగాళ్ల జాబితా వెల్లడిస్తున్న రోజు.. నేను మా అమ్మతో కలిసి టీవీలో వార్తలు చూస్తున్నా. అయితే.. ఒక్కసారిగా టీవీలో నా పేరు కనిపించింది. అయితే నేను నమ్మలేదు. అది పుకారేమో అనుకున్నా. అయితే.. సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత బీసీసీఐ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. జాతీయ జట్టుకు ఎంపికైనట్లు ఫోన్‌‌లో సమాచారం ఇచ్చారు. అప్పుడు ఆశ్చర్యపోవడం నా వంతయింది. తేరుకున్న తర్వాత అనుకున్నా ఇది నా రోజు అని.. నాకెంతో ప్రత్యేకమైన రోజు అని’ ఆనాటి సందర్భాన్ని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. అలాగే డ్రెసింగ్‌ రూమ్‌‌లో సీనియర్‌ ఆటగాళ్లతో తన తొలి సమావేశం అనుభవాలను కూడా షేర్ చేసుకున్నాడు.

‘డ్రెసింగ్‌ రూమ్‌‌లో సమావేశమైనప్పుడు జట్టు గురించి మాట్లాడమని అడిగారు. ఆ సమయంలో అంతమంది గొప్ప ఆటగాళ్లు నా వైపే చూస్తుంటే కాస్త ఆందోళనకు గురయ్యా’ అంటూ ఆనాటి సంగతులను కోహ్లీ నెమరు వేసుకున్నాడు.