కమలానికి తెలుగోడి దెబ్బ?

28 March, 2018 - 2:14 PM

(న్యూవేవ్స్ డెస్క్)

బెంగళూరు: ఒక వైపున కర్ణాటక శాసనసభకు ఎన్నికలు దూసుకొస్తున్నాయి. మరో వైపు మళ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌‌లో పసుపు రంగు జెండానే ఎగరాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కృతనిశ్చయంతో ఉన్నారు. అయితే రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో తగిన రీతిలో గుణపాఠం చెప్పారు తెలుగు ప్రజలు. అలాగే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన బీజేపీతో జత కట్టి ఎన్నికల్లో పోటీచేసి ఘన విజయం సాధించింది టీడీపీ. ఆ తర్వాత హోదా కాదు ప్యాకేజీ అన్నారు కమలనాథులు. కానీ ఆ విషయంలో కూడా మోదీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వానికి రిక్తహస్తం చూపించింది. ఈ పరిణామాలను కలలో కూడా ఊహించని చంద్రబాబు ఓ విధంగా హతాశుడయ్యారనే చెప్పాలి. దీంతో బీజేపీకి తలాక్ చెప్పారు చంద్రబాబు. ఆ తర్వాత అటు బీజేపీ.. ఇటు టీడీపీ మధ్య పోరు కాస్తా అమిత్ షా లేఖతో తారాస్థాయికి చేరింది.

నమ్మించి మోసం చేసిన కమలనాధులకు ఎలాగైనా తెలుగువాడి వేడి రూచి చూపించాలని తెలుగు తమ్ముళ్లు తెగ ఆరాటపడుతున్నారు. ఆ క్రమంలో చంద్రబాబును కలిసి.. ఈ విషయంపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. అదీ కూడా రానున్న సాధారణ ఎన్నికల్లో కాదు.. ముందుగానే అంటే కర్ణాటక ఎన్నికల్లో మన సత్తా చూపాలని చెప్పారట. అందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు అందుకు పలువురు నమ్మకమైన నేతలను రంగంలోకి దింపినట్లు సమాచారం.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే నెల 12న జరగనున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో రమారమి 40 శాతం మంది తెలుగు వారు వ్యవసాయంతో పాటు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. బెంగుళూరు నగరంలో కూడా భారీగా తెలుగు వారు సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడ్డారు. ప్రస్తుత మంత్రివర్గంలోనే పలువురు తెలుగువారు పలు కీలక శాఖలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లోని పలు జిల్లాలో తెలుగువారు భారీ సంఖ్యలో ఉన్నారు. వీరందరినీ ప్రభావితం చేసేందుకు టీడీపీ నేతలు ఇప్పటికే అచి తూచి అడుగులు వేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే మళ్లీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ నాయకుడు, ప్రస్తుతం సీఎం సిద్ధరామయ్య కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ క్రమంలో ఆయన వ్యూహ రచనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే లింగాయత్‌‌లకు ప్రత్యేక హోదా పేరుతో అసెంబ్లీలో తీర్మానం చేసి, దాన్ని కేంద్రానికి పంపి బాల్‌ను మోదీ కోర్టులో వేశారు. దీనిపై మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాంతో పాటుటా ప్రజలను ఆకట్టుకునేందుకు పలు పథకాలను కూడా సిద్దరామయ్య ఇప్పటికే ప్రకటించారు.

దేశంలో 29 రాష్ట్రాలుండగా ఇప్పటికే 21 రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది. దక్షిణాదిలో కూడా బలం పుంజుకోవాలని కమలం పార్టీ తహతహలాడుతోంది. ఆ క్రమంలో కర్ణాటకకు ప్యాకేజీ కింద వేల కోట్లు ఇచ్చినా.. ఇతర కానుకలు ఇచ్చినా.. మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహరచన చేసిన.. కన్నడ నాట కమలం వికాసం కష్టమని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.

కన్నడనాట స్థిరపడిన తెలుగోడి సెగకు కమలం వికసిస్తుందో లేక కమిలిపోతుందో మే 15 వరకూ వేచి చూడక తప్పదు.