సిత్రాలు సేయరో శివుడో శివుడా..!

06 August, 2018 - 3:24 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: నారమల్లి శివప్రసాద్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్ అంటే మాత్రం అందరికీ సుపరిచితమే. ఈయన చిత్తూరు ఎంపీగా పలు పర్యాయాలు గెలిచి పార్లమెంట్‌‌లో అడుగు పెట్టారు. ప్రజల సమస్యలపైనే కాదు.. రాష్ట్ర సమస్యలపై కూడా వాయువేగంగా స్పందించే గుణం శివప్రసాద్‌ సొంతం. అందుకు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందుతున్న సమయంలో పలువురు తెలుగు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ సమయంలో పార్లమెంట్ బయట శివప్రసాద్ వ్యవహరించిన తీరు తెలుగు ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా శివప్రసాద్ రోజుకో వేషం వేశారు. ఆ క్రమంలో ఆయన ఏ వేషాన్నీ వదిలిపెట్టలేదు. పురాణ పాత్రలే కాదు.. అపరిచితుడు లాంటి వేషాలు కూడా వేశారు. చిట్టచివరికి చిన్నపిల్లాడు వేషంలో పార్లమెంట్‌‌కు వెళ్లి… చిన్న పిల్లాడిలా మాట్లాడుతూ… విభజన హామీలు అమలు చేయని ప్రధాని మోదీని బెత్తంతో కొడతా అంటూ ముద్ద ముద్దగా.. ముద్దు ముద్దుగా పలికి అక్కడి వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

శివప్రసాద్ తాను వేసే వేషాలతో అటు పార్లమెంట్‌‌లోనే కాదు… ఇటు ప్రజల్లో కూడా ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఇప్పటికే శివప్రసాద్ దేవుని గెటప్‌‌లతో పార్లమెంట్‌‌లో అడుగుపెడితే.. పలువురు ప్రముఖ సభ్యులు సైతం ఆయన్ని కలసి అభినందనలు తెలుపుతున్నారు. అదీకాక చిత్తూరులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన నీరు, మన మట్టి, మన రాజధాని కార్యక్రమంలో ప్రధాని మోదీ వేషంలో దర్శనమిచ్చిన శివప్రసాద్‌‌ను చూసి ప్రజలు కేరింతలు కొట్టారు.

అయితే.. శివప్రసాద్ సహజ సిద్ధంగా నటుడు. ఆయన గతంలో ఖైదీ, యముడికి మొగుడుతో పాటు నిన్న మొన్న వచ్చిన పిల్లజమిందార్ వరకు దాదాపు పాతిక పైగా చిత్రాల్లో క్యారెక్టర్ అరిస్ట్ గానే కాకుండా.. విలన్ పాత్రలో కూడా ఒదిగిపోయి నటించారు. టాలీవుడ్‌‌లోని పలు చిత్రాలకు ఆయన దర్శకుడిగా కూడా పనిచేశారు. శివప్రసాద్ తెర మీద వేసిన వేషాలకు ఒక్క తెలుగు ప్రజల నుంచి మాత్రమే స్పందన వచ్చేది. కానీ పార్లమెంట్ వద్ద శివప్రసాద్ రోజుకో అవతారంలో దర్శనం ఇస్తుండటం.. అవి మీడియాలో ప్రసారం కావడంతో ఆయన పాపులారిటీ అలా ఇలా కాదు ఓ రేంజ్‌‌లో ఆకాశంలోకి దూసుకెళ్లిందనే చెప్పాలి.పార్లమెంట్ వద్ద శివప్రసాద్ అవతారాలు మీడియాలో చూసి.. సిత్రాలు సేయరో శివుడో శివుడా.. శివమెత్తి ఆడరో నరుడో.. నరుడా అంటూ తెలుగు ప్రజలు సెటైర్ వేస్తూ మరీ పాడుకుంటున్నారు. శివప్రసాద్ గెటప్‌లు శతావతారానికి చేరువ అవుతున్నాయి. పార్లమెంట్ వెలుపలా లోపలా… టీడీపీ ఎంపీలంతా ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగుతోంటే… శివప్రసాద్ మాత్రం వారితోనే ఉంటూ తన రూటే సపరేట్ అంటూ వివిధ గెటప్‌‌లలో దర్శనం ఇస్తున్నారు.టీడీపీ ఎంపీల్లో మురళీ మోహన్ కూడా నటుడే కానీ.. ఆయన ఇంత వరకు పార్లమెంట్ వద్ద ఒక్కసారి కూడా ఏ వేషమూ వెయ్యలేదు. కానీ శివప్రసాద్‌ రోజుకో వేషం వేసి.. ఆంధ్రుల ఆక్రందనను కేంద్రానికి తెలియజెప్పేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని మోదీ కన్నెత్తి కూడా చూడడం లేదని చిత్తూరు నియోజకవర్గం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.