ఐటీ దాడులు… స్పందించిన నేతలు

14 February, 2020 - 3:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఐటీ దాడుల్లో మాజీ సీఎం చంద్రబాబు మాజీ పీఎస్ పి.శ్రీనివాస్ నివాసంలో రూ. 2 వేల కోట్లు దొరికినట్లు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని టీడీపీ నేతలు బోండా ఉమ, యనమల రామకృష్ణుడు శుక్రవారం విజయవాడలో మండిపడ్డారు. పీఎస్ శ్రీనివాస్ నివాసంలో రూ. 70  నుంచి 80 వేలు మాత్రమే దొరికాయని బొండా ఉమా చెప్పారు. అయితే వేరో చోట్ల దొరికిన ఐటీ తనిఖీల్లో టీడీపీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి మరకలను టీడీపీకి అంటించాలని వైయస్ఆర్ సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని బొండా ఉమ ఆరోపించారు.

అలాగే మరో నేత యనమల మాట్లాడుతూ… మాజీ పీఎస్ శ్రీనివాస్‌తో టీడీపీకి సంబంధం ఏమిటని అధికార వైయస్ఆర్ సీపీ నేతలను యనమల సూటిగా ప్రశ్నించారు. మాజీ సీఎస్ శ్రీనివాస్ ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. అయినా పీఏలు, పీఎస్ లతో పార్టీకి సంబంధం ఏమిటని యనమల వైయస్ఆర్ సీపీ నేతలన సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో 10 నుంచి 15 మంది సీఎస్‌లు పని చేశారని ఈ సందర్భంగా యనమల గుర్తు చేశారు. శ్రీనివాస్ పై దాడుల పేరుతో టీడీపీపై బురద జల్లుతున్నారని యనమల మండిపడ్డారు. తెలంగాణలో ఇన్ ఫ్రా కంపెనీపై దాడిని టీడీపీకి అంటగట్టడం హేయమని యనమల అభివర్ణించారు. దాడులు జరిగిన ఇన్ ఫ్రా కంపెనీలకే సీఎం జగన్ కాంట్రాక్టులు ఇచ్చారన్నారు యనమల.

విజయవాడలో పి. శ్రీనివాస్ నివాసంలో దాదాపు 5 రోజుల పాటు ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత ఐటీ శాఖ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనతో రాజకీయంగా కలకలం మొదలైంది. ఈ దాడుల్లో రూ. 2 వేల కోట్లకు సంబంధించి అక్రమ లావాదేవిలు గుర్తించినట్లు ఈ ప్రకటనలో ఐటీ శాఖ పేర్కొంది. ఈ అక్రమ లావాదేవీలతో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేయాలని అధికార వైయస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు స్పందించారు. దానితో ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయాలు మరీ వేడెక్కాయి.