కోడెలకు వ్యతిరేకంగా టీడీపీ నేత దీక్ష

16 April, 2018 - 1:30 PM

(న్యూవేవ్స్ డెస్క్)

గుంటూరు: నర్సరావుపేట నియోజకవర్గం టీడీపీలో అంతర్గత పోరు పతాక స్థాయికి చేరింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అతని కుమారుడు కోడెల శివరాం తీరును నిరసిస్తూ స్థానిక టీడీపీ నేత, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ పులిమి వెంకటరామిరెడ్డి ఆమరణ దీక్షకు దిగడం సంచలనంగా మారింది. ‘పల్నాటి పులి’ అంటూ ఆయన అభిమానులు పిలుచుకునే స్పీకర్ కోడెలపై వెంకటరామిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేయడం పల్నాడు టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. నర్సరావుపేట నియోజకవర్గం టీడీపీకి ఇన్‌‌చార్జ్‌‌ని ప్రకటించి పార్టీని బతికించాలంటూ పులిమి వెంకటరామిరెడ్డి పాలపాడులోని తన స్వగృహంలో ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ నిరశన దీక్షలో ఆయన భార్య, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు కోటేశ్వరమ్మ కూడా పాల్గొనటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా వెంకట రామిరెడ్డి మాట్లాడుతూ.. నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీకి ఇన్‌‌చార్జ్‌ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ నరసరావుపేటలో దందాలు చేస్తూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాడని ఆరోపించారు. నర్సరావుపేటలో పార్టీ పరిస్థితిపై గతంలో ఎన్నోమార్లు టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, పార్లమెంట్‌ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు విజ్ఞప్తులు, ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. స్పీకర్‌ కోడెలకు భయపడి అతని కుమారుడి ఆగడాలను ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారని వెంకటరెడ్డి ఆరోపించారు.

పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న కోడెల కుమారుడు శివరామ్‌ను వెంటనే నరసరావుపేట నియోజకవర్గం నుంచి తప్పించకుంటే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లడం ఖాయమని వెంకటరెడ్డి హెచ్చరించారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇప్పటికే మూడుసార్లు ఓటమి పాలైందని, ఇప్పటికైనా మేల్కొనకపోతే పార్టీ కోలుకోలేని విధంగా నష్టపోవాల్సి వస్తుందని వెంకటరెడ్డి అన్నారు. 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకున్నవారు కూడా కోడెల శివరామ్ వైఖరి కారణంగా పార్టీకి దూరంగా వెళ్లిపోతున్నారని చెప్పారు. తన డిమాండ్‌పై అధిష్టానం స్పందించకపోతే తన ఇద్దరు కుమారులు, కోడళ్లు కూడా దీక్ష చేపడతారని, అందరం కలసి దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

మరోవైపు కోడెలకు వ్యతిరేకంగా వెంకటరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు వ్యతిరేకంగా ఇదే నియోజకవర్గానికి చెందిన మరికొందరు టీడీపీ నేతలు పాలపాడులోనే పోటీ రిలే నిరాహార దీక్షలను ప్రారంభించడం గమనార్హం. టీడీపీ నేతల పోటాపోటీ దీక్షలతో పాలపాడులో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు.