జగన్ పార్టీలోకి టీడీపీ నేత..?

23 April, 2018 - 2:07 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీకే చెందిన మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అఖిలప్రియ తీరును గర్హిస్తూ ఏవీ సుబ్బారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా సైకిల్‌ ర్యాలీ చేస్తున్నారు. సైకిల్‌ ర్యాలీ చేస్తున్న సుబ్బారెడ్డిపై టీడీపీకి చెందినవారే కొందరు రాళ్ళతో దాడిచేశారు. ఇలా రాళ్ల దాడి చేసింది మంత్రి అఖిలప్రియ అనుచరులే అని, ఆమెతో పాటు కొందరి పేర్లతో సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన రాళ్ళ దాడిలో అఖిలప్రియ పాత్రకు సంబంధించి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఇది ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య తాజాగా జరిగిన పరిణామం.

అయితే.. అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య నియోజకవర్గంలో వర్గపోరు చాన్నాళ్లుగా కొనసాగుతోంది. నిజానికి అఖిలప్రియ తండ్రి భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఏవీ సుబ్బారెడ్డి కొనసాగేవారు. నాగిరెడ్డి మరణం తరువాత సుబ్బారెడ్డి- అఖిలప్రియ మధ్య వర్గపోరు పీక్ స్టేజ్‌కు వెళ్లిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అఖిలప్రియ, సుబ్బారెడ్డి పోటాపోటీగా సైకిల్ యాత్రలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే నంద్యాల కేబుల్ ప్రసారాల్లో మంత్రి అఖిలప్రియకు సంబంధించిన వార్తలు కానీ, ఆమె ఫొటోలు కానీ రాకుండా సుబ్బారెడ్డి నిలిపివేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక మహిళ అయిన తాను మంత్రిని కావడం సుబ్బారెడ్డికి మింగుడు పడడం లేదని, అందుకే ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ అఖిలప్రియ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుబ్బారెడ్డి సైకిల్ యాత్రపై రాళ్ళదాడి జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.

సుబ్బారెడ్డిపై జరిగిన రాళ్ళదాడిని టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. తక్షణమే అమరావతి రావాలంటూ అఖిలను, సుబ్బారెడ్డిని ఆదేశించింది. వీరిద్దరిలో ఎవరిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తే.. వారు పార్టీకి గుడ్‌బై చెప్పేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మంత్రి పదవిలో ఉన్నప్పటికీ అఖిలప్రియ కొంత కాలంగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏవీ సుబ్బారెడ్డిని నియంత్రించే విషయంలో అధిష్టానం అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఆమె మరింత ఆవేదనకు గురయ్యారట. ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ సొంత గూడు వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. మంత్రి పదవిలో ఉన్న తాను ఇప్పటికిప్పుడే పార్టీ మారితే బాగుండదని, సమయం కోసం వేచి చూస్తున్నారనేది విశ్లేషకుల ఊహాగానం.