పవన్‌ కల్యాణ్ టార్గెట్‌గా ఇకపై రెచ్చిపోండి?

11 July, 2018 - 12:50 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: తెలుగుదేశం పార్టీని, ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసే విమర్శలపై ఇక నుంచి దీటుగా స్పందించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రులు, పార్టీ నేతలకు ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. పవన్ విమర్శలపై గట్టిగా ప్రతిస్పందించాలని, ఆయన చేసే ఆరోపణలలోని డొల్లతనాన్ని బయటపెట్టేలా విమర్శనాస్త్రాలకు పదును పెట్టాలని టీడీపీ నాయకత్వం కింది స్థాయి నేతలకు సూచించింది. నిన్నమొన్నటి వరకూ టీడీపీకి మిత్రుడిగా ఉన్న పవన్‌ను ఇక ఆ దృష్టితో చూడవద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మాదిరే బద్ధ శత్రువుగా భావించాలని కూడా టీడీపీ నిర్ణయించింది.

ఇప్పటి వరకూ పవన్ ఆరోపణలపై తెలుగుదేశం నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. దీనివల్ల కార్యకర్తల్లోకి, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని భావించిన పార్టీ పెద్దలు, ఇకపై ఆయన విమర్శలను తీవ్రంగా తిప్పి కొట్టాలని తేల్చారు. ఎన్నికల వేళ పవన్ ఆరోపణల ప్రభావం ఓటర్లపై పడకుండా చూసేందుకు ఎదురుదాడి చేయడమే సరైన మార్గమని, వైఎస్ఆర్‌సీపీపై ఎలా విరుచుకుపడుతున్నామో, పవన్‌ పైన కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పించాలని చంద్రబాబు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుండగా, రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీని పవన్ కల్యాణ్ వేలెత్తి చూపడం లేదనే విమర్శలు టీడీపీ నేతల నుంచి వస్తున్నాయి. ఇక పవన్ నోటి నుంచి టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు వస్తే, వాటిని తక్షణం ఎండగట్టేందుకు నేతలు సంసిద్ధం అవుతున్నారని సమాచారం.