కోడికత్తి కేసులో ఎన్ఐఏ దర్యాప్తుపై పిటిషన్

23 January, 2019 - 3:05 PM

(న్యూవేవ్స్ డెస్క్)

విజయవాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో జరిగిన దాడి కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జ్‌‌షీట్‌ దాఖలు చేసే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలిపివేయించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్‌ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎలాంటి చలనమూ లేదు. హైకోర్టు తుదితీర్పు వచ్చేంతవరకూ ఎన్‌ఐఏకు సహకరించేది లేదని చంద్రబాబు ప్రభుత్వం కరాఖండిగా స్పష్టం చేసింది.

తాజాగా జగన్‌పై జరిగిన దాడి కేసు విచారణను నిలిపివేలంటూ ఎన్ఐఏ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఎన్‌ఐఏ విచారణ ఆపాలని పిటిషన్‌‌లో పేర్కొంది. వైఎస్‌ జగన్‌‌పై జరిగిన దాడి కేసును కావాలనే రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని న్యాయవాది వెంకటేశ్‌ శర్మ ఆరోపించారు. ఎన్ఐఏ చార్జిషీట్‌ దాఖలు చేస్తే.. అసలు కుట్రదారులు బయటికి వస్తారనే భయంతోనే కేసును అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని విమర్శించారు.