మాజీ ఎంపీ శివప్రసాద్ తుదిశ్వాస

21 September, 2019 - 8:58 PM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ (68) శనివారం మధ్యాహ్నం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధ వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ నెల 12న శివప్రసాద్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటి నుంచీ అపోలో ఆస్పత్రి వైద్యులు డయాలసిస్‌ చేస్తున్నారు. 1951జూలై 11న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లిలో శివప్రసాద్ జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్య అభ్యసించారు.

వైద్యుడిగా సేవలు అందిస్తూ చిత్రరంగంలోకి ప్రవేశించారు. సినీరంగంలో శివప్రసాద్ తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించారు. పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించి, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రేమ తపస్సు, టోపీ రాజా- స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరోకో వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.  పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక 2006లో ‘డేంజర్‌’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.

ఒక వైపున సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా, రెండుసార్లు చిత్తూరు ఎంపీగా పనిచేశారు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. సమాచార, సాంస్కృతిక మంత్రిగా శివప్రసాద్ సేవలందించారు. 2009, 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలిదారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్ ఆవరణలో ఆయన రోజుకో వేషం వేస్తూ వినూత్నంగా నిరసనలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన సహవిద్యార్థి అనే విషయం తెలిసిందే.

శివప్రసాద్‌ మృతి పట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. చంద్రబాబు శుక్రవారం సాయంత్రం శివప్రసాద్‌ను పరామర్శించారు. శివప్రసాద్‌ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు జగన్‌ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా శివప్రసాద్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా శివప్రసాద్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు.