ధర్నా చౌక్‌లో దీక్ష !

08 November, 2019 - 7:42 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: ఇసుక కొరత నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టనున్న దీక్షకు వైయస్ జగన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీక్షను అనుమతి ఇవ్వాలని పోలీస్, మున్సిపల్ కమిషనర్‌ని టీడీపీ సీనియర్ల ప్రతినిధి బృందం కోరింది. అయితే మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వ కార్యక్రమాలకు మినహా ప్రవేట్ కార్యక్రమాలకు అనుమతి లేదని టీడీపీ నేతలకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్‌తోపాటు మరో రెండు ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలిస్తున్నారు.

అయితే చంద్రబాబు దీక్షకు ధర్నా చౌక్ అయితే ఉత్తమం అనే నిర్ణయానికి టీడీపీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఇతర ప్రదేశాల్లో అయితే మళ్లీ ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ సారి కూడా దీక్షకు అనుమతి ఇవ్వకుంటే.. మళ్లీ పరిస్థితి మొదటికొచ్చే అవకాశం ఉందనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్‌ని టీడీపీ నేతలు ఓకే చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ధర్నా చౌక్‌లో చంద్రబాబు దీక్ష చేస్తే.. ఇతర జిల్లాల నుంచి వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల కోసం స్థలం సరిపోతుందా ? లేదా ? అనే ఆలోచనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారని సమాచారం.

వైయస్ జగన్ ప్రభుత్వ ఏర్పడి .. 150 రోజులు అంటే ఐదు నెలలు దాటిపోయింది. అయినా రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దాంతో నవంబర్ 14వ తేదీన విజయవాడలో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు చంద్రబాబు నిరాహారదీక్ష చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

అలాగే నవంబర్ 3వ తేదీన విశాఖ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా లాంగ్ మార్చ్ నిర్వహించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ లాంగ్ మార్చ్‌ కి టీడీపీ మద్దతు ప్రకటించడమే కాకుండా… ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు నేతలు హాజరయ్యారు. అలాగే బీజేపీ, వామపక్షాలు సైతం ఈ లాంగ్ మార్చ్‌ పై సానుకూలంగా స్పందించాయి. అదీకాక.. పవన్ పిలుపునందుకుని లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు సైతం ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొని విజయవంతం చేశారు.