ఆదాయపు పన్ను సీలింగ్ పెంపు?

09 January, 2018 - 8:53 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: 2018-19 బడ్జెట్‌‌లో కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట కల్పించాలని చూస్తోందని తెలుస్తోంది. వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితిని ఆర్థిక మంత్రిత్వ శాఖ పెంచుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం మాత్రమే కాకుండా, పన్ను శ్లాబ్‌లను కూడా సర్దుబాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రూ.2.5 లక్షలుగా ఉన్న పన్ను మినహాయింపు పరిమితిని కనీసం రూ.3 లక్షలకు పెంచాలనే ప్రతిపాదనలు ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందుకు వచ్చినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పన్ను మినహాయింపును పెంచడంతో పాటు, శ్లాబ్‌లను సర్దుబాటు చేయడం మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా జీతం జీవులకు మేలు కలగబోతోంది.

గత సంవత్సరం బడ్జెట్‌‌లో పన్ను శ్లాబ్‌లను మార్చకుండా చిన్న పన్ను చెల్లింపుదారులకు స్వల్పంగా ఊరటనిస్తూ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నవారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి కేంద్రం తగ్గించింది. ఈ ఏడాది బడ్జెట్‌‌ను ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌‌లో ప్రవేశపెట్టనున్నది. ఈ బడ్జెట్‌‌లో రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రూ.10-20 లక్షలున్న వారికి 20 శాతం, రూ.20 లక్షలు పైన ఆదాయం ఉంటే 30 శాతం పన్ను రేటు విధించాలని చూస్తోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో జీవన వ్యయాలు భారీగా పెరిగాయని, దీంతో మినహాయంపుల బేసిక్‌ పరిమితిని, పన్ను శ్లాబ్‌లను సర్దుబాటు చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.