‘వంశీ రాజీనామా చేయాలి’

16 November, 2019 - 6:07 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఎమ్మెల్యే.. పార్టీ మారాలంటే తప్పని సరిగా తన పదవికీ రాజీనామా చేయాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనవి సీతారాం స్పష్టం చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వైయస్ఆర కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే .. ముందుగా తన పదవికి రాజీనామా చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.

రాజీనామా చేయకుండా పార్టీ మారితే చర్యలు తప్పవని స్పీకర్ తమ్మినేని హెచ్చరించారు. సభా నాయకుడిగా సీఎం వైయస్ జగన్ కూడా ఇదే చెప్పారని.. తాను కూడా దానికే కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. శనివారం న్యూఢిల్లీలో సాంకేతికతపై స్పీకర్ల సబ్ కమిటీ భేటీలో తమ్మినేని సీతారాం పాల్గొని.. ప్రసంగించారు.

కృష్ణాజిల్లా గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపొందారు. తాజాగా ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎమ్మెల్యేలు ఎవరైనా మరోపార్టీలోకి చేరితే.. వెంటనే వారు రాజీనామా చేయాల్సిందేనని అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు కట్టుబడి ఉన్నానని ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 23 మంది వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు.. సైకిల్ పార్టీలోకి వెళ్లారు. ఆ తర్వాత వారిలో చాలా మందికి మంత్రి పదవులు సైతం చంద్రబాబు కట్టబెట్టారు. ఆక్రమంలో వారిపై అనర్హత వేటు వేయాలని నాటి అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైయస్ జగన్ కోరారు. కానీ టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ కాలపరిమితి ముగిసే వరకు ఎమ్మెల్యేలుగా కొనసాగిన సంగతి తెలిసిందే.