సీతారాం జోస్యం

13 May, 2019 - 4:33 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: దేశ రాజకీయాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని ఓ వర్గం ఆయనను ఆకాశానికెత్తుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ్మినేని సీతారాం ఆరోపించారు.

సోమవారం హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెడుతున్నారని విమర్శించారు.

మే 23న వెలువడనున్న ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ ప్యాకప్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడానికి దేశ రాజకీయాల్లో బాబు బ్రహ్మాండం క్రియేట్ చేస్తున్నారనే బిల్డప్ ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చానని చెప్పుకుంటున్నారని .. అవి ఏ పార్టీలో చెప్పాలని సీఎం చంద్రబాబును తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించిందని.. ఎస్పీ, బీఎస్పీలు అయితే కాంగ్రెస్‌తో కలిసే ప్రసక్తే లేదంటున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీడీపీ అమ్మకానికి సిద్ధంగా ఉంది.. కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని తమ్మినేని సీతారాం అన్నారు.