ఇప్పుడు నేను వచ్చా.. అప్పుడు కేసీఆర్ వస్తారు

14 January, 2019 - 4:53 PM

(న్యూవేవ్స్ డెస్క్)

అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబకు రిటర్న్ గిఫ్ట్ కచ్చితంగా ఇస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు. అయినా తాము కాదని.. ఏపీ ప్రజలే టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

సంక్రాంతికి తాను వచ్చానని.. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కేసీఆర్ వస్తారని చెప్పారు. కేవలం ప్రచారానికి పరిమితమైన నాయకుడు చంద్రబాబు అని తలసాని శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో ప్రచారాలు చేసుకున్నంత మాత్రానా.. వాస్తవాలు దాచలేరని చంద్రబాబును ఉద్దేశించి తలసాని వ్యాఖ్యానించారు.

సంక్రాంతి పండగను పురస్కరించుకుని.. పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందాలు షూరు అయినాయి. ప్రతి ఏడాది కోడిపందాలు జోరుగా జరుగుతాయి. వాటిలో పాల్గొనేందుకు తలసాని శ్రీనివాస యాదవ్ ఆయన అనుచరులతో వెళ్తున్న సంగతి తెలిసిందే.

ఆ క్రమంలో సోమవారం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని తలసాని శ్రీనివాస యాదవ్ దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధాన మిచ్చారు. అంతముందుకు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో యాదవులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా తలసాని ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కుల రాజకీయాలకు కారణం చంద్రబాబే అని తలసాని శ్రీనివాస యాదవ్ ఆరోపించారు. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇస్తామంటూ కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ తాను చూసినట్లు చెప్పారు.

అయినా ఏ పార్టీకి మద్దతి ఇస్తామో తాము ఇంకా ప్రకటించ లేదన్నారు. అయితే ఏపీకి ప్రత్యేక హోదాకు తాము మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించారు. అవిశ్వాసం విషయంలో చంద్రబాబు డ్రామాలాడితే తాము మద్దతు ఇవ్వాలేదని తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు.

వైయస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామా చేస్తామంటే ఎందుకు సహకరించలేదని టీడీపీ నాయకులకు తలసాని శ్రీనివాస యాదవ్ ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అన్నవారిని చంద్రబాబు జైల్లో పెట్టించారని గుర్తు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏపీ నుంచి భాగస్వామ్యం అయ్యే పార్టీ ఏదో త్వరలోనే తెలుస్తుందన్నారు. ఏపీ ప్రజానీకం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి దాసోహం అంటున్నారని విమర్శించారు.