తాసీల్దార్ హత్యకేసు నిందితుడు మృతి

08 November, 2019 - 6:01 AM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్‌: అబ్దుల్లాపూర్‌మెట్‌ తాసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు కూర సురేశ్‌ గురువారం మృతిచెందాడు. ఈ నెల 4న విధినిర్వహణలో ఉన్న తాసీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో నిప్పంటుకుని ఆస్పత్రిలో చేరిన డ్రైవర్‌ గుర్నాధం రెండు రోజుల క్రితం మరణించాడు. నిందితుడు సురేశ్‌ కూడా ఇదే ఘటనలో గాయపడ్డాడు. సుమారు 65 శాతం కాలిన గాయాలతోనే సురేశ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకోవడంతో పోలీసులు ఆ రోజే చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సురేశ్‌ ఛాతీ, ముఖం, చేతులకు కాలిన గాయాలయ్యాయి. మంటల్లో చర్మం కాలిపోవడంతో పాటు మంటల వేడికి రక్తనాళాలు దెబ్బతిన్నాయి. శ్వాస తీసుకోవడం కూడా కష్టమైంది.

దీంతో బుధవారం సాయంత్రం సురేశ్‌ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేశారు. అయితే.. గురువారం ఉదయమే సురేశ్ చనిపోయాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే ఉస్మానియా వైద్యులు సురేశ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు. తీరా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు సురేశ్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి ఉస్మానియా మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు.