దీపక్ హ్యాట్రిక్.. టీమిండియాదే సీరీస్

11 November, 2019 - 1:36 AM

(న్యూవేవ్స్ డెస్క్)

నాగ్‌పూర్: పర్యాటక బంగ్లాదేశ్‌తో నాగ్‌పూర్‌లో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌ను భారత్ 30 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. దీంతో మూడు టీ20ల ఈ సీరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ హ్యాట్రిక్‌తో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఓ ఆటాడుకున్నాడు. టీమిండియా మొదట్లో కాస్త తడబాటు ప్రదర్శించింది. మధ్యలో మరి కొంచెం కంగారు పడింది. అయినా.. యధా ప్రకారం ఆఖరిలో మళ్ళీ టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆట రెండో ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగుల వ్యక్తిగత స్కోరుకే ఔటైపోయాడు. దూకుడుగా ఆడుతున్న మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానాన్ని వీడాడు. దీంతో 35 పరుగులకే భారత్ ఓపెనర్లిద్దర్నీ కోల్పోయింది. అయితే.. శ్రేయస్ అయ్యర్. కేఎల్ రాహుల్ రాణించి బాధ్యతాయుతంగా ఆడారు. ముందుగా నిదానంగా ఆడిన ఈ జోడీ అనంతరం బంగ్లా బౌలర్లను చితకబాదారు. స్ట్రోక్‌ప్లేతో రాహుల్ అదరగొట్టాడు. శ్రేయస్ అయితే సిక్సర్లతో చెలరేగిపోయాడు. అయితే.. రిషబ్ పంత్ (6) మరోసారి నిరాశపరిచాడు. చివరిలో మనీశ్ పాండే (22 నాటౌట్), బ్యాట్‌ను ఝళిపించాడు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి, 174 పరుగులు చేసింది. బంగ్లాకు 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లా బౌలర్లలో షఫియుల్, సౌమ్య సర్కార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అల్ అమిన్ ఒక వికెట్ తీశాడు.

ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ను దీపక్ చాహర్ దెబ్బకొట్టాడు. హ్యాట్రిక్ ప్రదర్శనతో పాటుగా 6/7 అదరగొట్టాడు. భారత విజయంలో కీలకపాత్ర పోషించిన దీపక్ చాహర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు అందుకున్నాడు.

175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ ఓపెనర్ మహ్మద్ నయీం విధ్వంసక ఆటతీరుతో భారత్ బౌలర్లను భయపెట్టినా, ఆల్ రౌండర్ శివం దూబే (3/30) సరైన సమయంలో విజృంభించాడు. నయీంతో పాటు ఆతిఫ్ హుస్సేన్ (0)ను కూడా పెవిలియన్‌కు పంపించి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. అంతకు ముందు ప్రమాదకర ముష్ఫికర్ రహీమ్‌ను అవుట్ చేసిన దూబే భారత్‌కు మ్యాచ్‌పై ఆశలు కల్పించాడు. బంగ్లా జట్టును మీడియం పేసర్ దీపక్ చాహర్ ఆరంభంలోనే దెబ్బతీశాడు. చాహర్ దాటికి 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా, నయీం మెరుపుదాడితో బంగ్లా కోలుకుంది. నయీం 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు. మొత్తమ్మీద పరుగుల వేటలో బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. చివర్లో చాహర్ వెంటవెంటనే రెండు వికెట్లు తీసి బంగ్లా ఇన్నింగ్స్‌కు చరమగీతం పాడాడు. ఈ మ్యాచ్‌లో చహర్‌కు 6 వికెట్లు లభించాయి.