మూకుమ్మడి రాజీనామాలకు టీసీఎల్పీ నిర్ణయం

13 March, 2018 - 12:46 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: శాసనసభ వేదికగా తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే యత్నంలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన హెడ్ సెట్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కుడి కంటికి గాయం అయింది. దీంతో మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం అయిన వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరో ఎమ్మెల్యే సంపత్‌లను బర్తరఫ్ చేస్తూ సభ మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు స్పీకర్ మదుసూదనాచారి ప్రకటించారు. టీ కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి, డీకే అరుణ తదితరులు మొత్తం 11 మందిని సభ నుంచి ఈ సమావేశాలు పూర్తయ్యేంత వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. మండలిలో కూడా కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులను కూడా సస్పెండ్ చేశారు.

దీంతో జానారెడ్డి అధ్యక్షతన సీఎల్పీలో అత్యవసరంగా భేటీ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. పార్టీ అధిష్టానం అనుమతి రాగానే రాజీనామాలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తమ పార్టీ అధిష్టానం అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. సస్పెన్షన్ నిర్ణయాన్ని స్పీకర్ ఏకపక్షంగా తీసుకున్నారంటూ వారు దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. సభలో పెద్ద మొత్తంలో పోలీసులను పెట్టి కాంగ్రెస్ సభ్యులపై దాడి చేయించారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ నియంత‌ృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.

ప్రభుత్వ నిర్ణయం అప్రజాస్వామికం అని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి సభలో సోమవారం జరిగిన సంఘటన గవర్నర్ పరిధిలోనిది అన్నారు. న్యాయ నిపుణులతో సంప్రతిస్తున్నమని ఆయన చెప్పారు. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయంపై పార్లమెంట్ కల్పించుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో గవర్నర్‌పై సభలోనే దాడికి దిగిన హరీష్‌రావు ఇప్పుడు సస్పెన్సన్ తీర్మానం ప్రతిపాదించడం దారుణం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో తమ గొంతు నొక్కారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సభలో సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారంటూ భట్టి విక్రమార్క ఫైరయ్యారు. బడ్జెట్‌పై చర్చలో కాంగ్రెస్ వాయిస్ లేకుండా చేయాలనే ప్రభుత్వం ఇంత దుర్మార్గమైన చర్యకు ఒడిగట్టిందన్నారు.

మొత్తానికి ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం, 11 మందిని సస్పెండ్ చేయడం, మండలిలో కూడా సస్పెన్షన్ వేటు వేయడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది.

కాగా.. ప్రతిపక్ష నేతను శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గానీ, ప్రస్తుత తెలంగాణ శాసనసభలో గానీ ఇదే తొలిసారి. ప్రతిపక్ష నేత కె. జానారెడ్డిని కూడా స్పకర్ మధుసూదనాచారి మిగతా పది మంది సభ్యులతో పాటు ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు.