దుమ్ము రేపుతున్న ‘సైరా’ ‘వసూల్’!

04 October, 2019 - 5:30 AM

భారత తొలి స్వాతంత్ర్ర్య సమర యోధుడు, తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా వెండితెరపై ఆవిష్కృతం అయిన ‘సైరా’ నరసింహారెడ్డి విడుదలైన ప్రతిచోటా ప్రశంసలు అందుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి పుష్కర కాలంగా కలగంటున్న డ్రీమ్ ప్రాజెక్టు మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై చిరంజీవి తనయుడు, మెగ పవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ మూవీని నిర్మించారు. చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల సమర్పణలో, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుని, రికార్డు వసూళ్ళతో దూసుకుపోతోంది.

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళతో సైరా నరసింహారెడ్డి సినిమా ఉరకలు పెడుతోంది. సైరా వసూళ్ళు తొలిరోజు బుధవారం దేశంలోని అన్ని భాషల్లోనూ కలిపి రూ.62 కోట్లు కొల్లగొట్టగా.. రెండో రోజున రూ.25.35 కోట్లు రాబట్టింది. మొత్తంగా 87.35 కోట్ల రూపాయల వసూళ్ళు చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా కలిపి రెండో రోజు బుధవారం వరకూ 120 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం అందుతోంది. సైరా విడుదలైన రెండో రోజున ఓవర్సీస్‌లో అన్ని భాషల్లోనూ కలిపి రూ.20 కోట్లు కలెక్ట్ చేసినట్లు అంచనాలు వస్తున్నాయి. ఇక రెండో రోజుకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.180 కోట్లు వసూలైందని అంచనాలు వస్తున్నాయి. రెండో రోజున కూడా అమెరికాలో రిలీజైన అన్ని థియేటర్లలో ఆక్యుపెన్సీ రేట్ బంపర్‌గా ఉందని తెలుస్తోంది. పూర్తి సమాచారం అందితే వసూలైన మొత్తం మరింతగా పెరగవచ్చని తెలుస్తోంది.సైరా మూవీ అక్టోబర్ 2 బుధవారం భారతదేశంలో గ్రాండ్‌గా విడుదల కాగా.. అమెరికాలో మంగళవారం రాత్రి నుంచీ ప్రీమియర్ షోలు ప్రదర్శించిన అన్ని థియేటర్లలోనూ హౌస్‌ఫుల్‌గా నడిచాయి. అమెరికాలో మంగళవారం మొత్తం 308 కేంద్రాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించగా.. 8,57,865 డాలర్లు వసూలైంది. ఈ మొత్తం బుధవారం షోలు ముగిసే సమయానికి మిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తుందనే అంచనాలు వచ్చాయి. ఇక ఆస్ట్రేలియాలో కూడా సైరా నరసింహారెడ్డి వసూళ్ళలో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. విడుదలైన మొదటి రోజే మొత్తం 39 కేంద్రాల్లో కలిపి 1,89,237 ఆస్ట్రేలియా డాలర్లను కొల్లగొట్టింది.

ఇక భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో తొలిరోజున రూ.32 కోట్లు, ఉత్తరాదిలో రూ.35 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళనాడులో తెలుగు, తమిళ భాషల్లో కలిపి తొలి రోజున మొత్తం రూ.32 లక్షలు రాబట్టింది. అంతకు ముందు సైరా నరసింహారెడ్డి ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. అందులో నైజాంలో రూ,28, సీడెడ్‌లో రూ.20, ఉత్తరాంద్రలో రూ.15 కోట్ల బిజినెస్ చేసింది.