‘ఔరా’..! అనిపించిన ’సైరా’..!

02 October, 2019 - 11:55 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన చారిత్రక మూవీ ‘సైరా’ నరసింహారెడ్డి తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమడింపజేసి ‘ఔరా’ అనిపించిందని చెప్పాలి. చిరంజీవి సినిమా అనగానే అభిమానులు సగటు ప్రేక్షకుడు ఆశించే అంశాలన్నీ ఈ మూవీలో కనిపిస్తాయి. సైరా మూవీలో చిరంజీవి ఎంట్రీ గానీ, ఒక్కొక్క పాత్రను పరిచయం చేయడంలో, కథా గమనంలోకి ప్రేక్షకుల్నిలీనం చేయడంలో పకడ్బందీ వ్యూహాన్నే దర్శకుడు సురేందర్‌రెడ్డి రూపొందించుకున్నాడని చెప్పాలి. సైరా మూవీలో ప్రీ  క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ప్రతీ సన్నివేశమూ ప్రేక్షకుడి భావోద్వేగానికి గురిచేస్తుంది. సైరా నరసింహారెడ్డి ఉరికంబం ఎక్కే సీన్ థియేటర్‌లో ప్రతి ఒక్కరినీ ఎమోషనల్‌గా మార్చేసింది. ఇక మూవీ ఆఖరి పది నిమిషాలు సైరాలో హై ఓల్టేజ్‌గా నిలిచాయి. సినిమా మొత్తం తానే అయి నడిపించిన చిరంజీవి నటనతో ప్రేక్షకుల్లో గూస్ బమ్స్ కలిగించాయి. సైరా నరసింహారెడ్డిని ఆంగ్లేయులు ఉరి తీసినట్టుగా ఉంది. అయితే.. క్లైమాక్స్‌కు భావోద్వేగాలు జోడించడం సినిమాను విషాదాంతంగా ముగించినట్లు అనిపించదు. మూవీ ప్రారంభంలో, ఎండింగ్‌లో పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ మెగా అభిమానులను ఆకట్టుకుంది.

సైరా మూవీలో మరో ప్రధాన పాత్ర తమన్నా నటించిన లక్ష్మి పాత్ర. నరసింహారెడ్డి ప్రియురాలు, కళాకారిణిగా తమన్నా నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా లక్ష్మి పాత్రకు చివరి ఘట్టంలో ఆమె నటన, ఆత్మాహుతి చేసుకుంటూ ఆంగ్ల సైనికుల్ని కూడా అంతం చేసే ఘట్టం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అంతకు ముందు తన నాట్యం, పాటలతో ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రేకెత్తించే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

సైరా నరసింహారెడ్డి అర్ధాంగి సిద్దమ్మ పాత్రలో నయనతార ఒదిగిపోయింది. సైరా నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఎంతో హుందాగా కథా గమనాన్ని నడిపించడం కీలకంగా నటించారు. ఇక ఈ సినిమాలో అవుకురాజు పాత్రలో కిచ్చా సుదీప్ నటన అద్భుతంగా ఉంది. పాండిరాజాగా విజయ్ సేతుపతి ఎంట్రీ నుంచి చివరి వరకూ తన నటనతో ఆకట్టుకున్నాడు. వీరారెడ్డిగా జగపతిబాబు, సైరా అనుచరుడిగా బ్రహ్మాజీ, మోసపూరిత పాత్ర బసిరెడ్డిగా రవికిషన్ కనిపించాడు.

సైరా కథ:
ఝాన్సీపై ఆంగ్లేయులు దాడి చేయడంతో కథ ప్రారంభం అవుతుంది. తొలి స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నది మనం కాదని, అంతకు ముందే బ్రిటిష్ వారిని రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గడగడలాడించాడంలూ ఝాన్సీ లక్ష్మీభాయ్ (అనుష్క) తన సైనికుల్లో స్ఫూర్తిని నింపే క్రమంలో చెప్పడంతో సైరా మూవీ ప్రారంభం అవుతుంది. తొలి స్వాతంత్ర్య పోరాటాని కంటే ముందే అంటే 1847లో రాయలసీమలోని ఉయ్యాలవాడ ప్రాంతానికి పాలెగాడు నరసింహారెడ్డి (చిరంజీవి). బ్రిటీష్ వారి పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతంలో 61 మంది పాలెగాళ్ళు ఉండేవారు. తీవ్రమైన కరువు వచ్చినప్పుడు కూడా బ్రిటిష్ వారు రైతులు, వ్యాపారులను పన్నులు కట్టాలంటూ వేధిస్తుంటారు. గురువు గోసాయి వెంకన్న (అమితాబ్ బచ్చన్) స్ఫూర్తితో బ్రిటిష్ వారి అకృత్యాలపై సైరా ఎదురుతిరుగుతాడు. సైరా నరసింహారెడ్డి నుంచి స్వాతంత్ర్య పోరాట ఉద్యమం మొదలైంది.

ఈ సినిమాలో బుర్రా సాయిమాధవ్ రాసిన డైలాగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ‘మనం ఎందుకు పుట్టామో తెలిస్తే.. ఎందుకు మరణించాలో అర్థం అవుతుంది’ అంటూ లక్ష్మితో సైరా చెప్పిన డైలాగ్.. కథా గమనానికి ఓ కీలక మలుపుగా మారింది. ‘కురిసే వర్షం శిస్తు అడగదు.. తడిసే భూమి శిస్తు అడగదు.. మీకెందుకు కట్టాలిరా శిస్తు’ లాంటి సైరా మాటలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. క్లైమాక్స్‌లో చిరంజీవి మరణం కాదు ఇది జననం.. అంటూ పలికే సంభాషణలు ప్రేక్షకుల్లో రోమాంచితాలయ్యాయి. ‘ద్వేషం కోసం కాదు దేశం కోసం నిలబడు’ వంటి ఎన్నెన్నో అద్భుతమైన, అర్థవంతమైన మాటల్ని బుర్రా సాయిమాధవ్ అందించాడు. ఇక సైరా మూవీకి మరో ప్రధాన ఆకర్షణ అమిత్ త్రివేది అందించిన సంగీతం. రెండు పాటలే ఉన్నా వాటి సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళగా.. వాటని చిత్రీకరించిన తీరుతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. జూలియస్ ప్యాకియయ్ అందించి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని మరింత పండేలా చేసింది. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. రత్నవేలు అనుభవం, నైపుణ్యం ప్రతి ప్రేమ్‌లోనూ కనిపిస్తుంది.

సినిమా మొత్తం భారీ తారాగణంతో, ప్రతి సీన్ ఎంతో నిండుగా ఉంటుంది. అయితే.. ప్రేక్షకుడి కళ్ళు మాత్రం  కేవలం సైరా నరసింహారెడ్డి మీదీ ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. సినిమా మొత్తం చిరు తన భుజస్కంధాలపైనే మోశాడనే చెప్పాలి. ప్రధానంగా ఫస్ట్ హాఫ్ చివరిలో వచ్చే సీన్‌లో చిరంజీబి యాక్షన్ సూపర్బ్. ఆశ్చర్యపోయే పోరాట సన్నివేశాలను చిరంజీవి చాలా ఈజ్‌తో చేయడం ఆకట్టుకుంటుంది. నిర్మానంలో ఏ ఫ్రేమ్‌లోనూ రాజీ పడకుండా చేసిన ఖర్చు తెర మీద ఆవిష్కృతం అయింది. ఎడిటింగ్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ అన్ని విభాగాల్లోనూ సైరా మూవీ పనితనం కనిపిస్తుంది. మూవీని సక్సెస్ చేయడంలో 24 క్రాఫ్ట్ చక్కగా ఉపయోగపడ్డాయి.

చివరిగా సైరా మూవీలో కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకున్నాయి. ఇష్టం వచ్చినట్లు వేసిన పన్నును కట్టలేకపోయిన రైతుల పంట మొత్తాన్ని ఆంగ్లేయులు తరలించుకుపోతుంటే.. ఓ చిన్న పిల్లాడు పిడికెడు గింజల్ని తీసుకున్న సీన్ పండింది. ఆ కుర్రాడ్రి విచక్షణా రహితంగా ఆంగ్లేయులు కొట్టడంతో రైతులంతా తలా పిడికెడు గింజలు పట్టుకున్న సీన్ తర్వాత ఆ పిల్లాడ్ని సజీవంగా మంటల్లో వేసిన దృశ్యం హృదయ విదారకంగా ఉంది. నీది కానిది ఏదీ ముట్టుకోవద్దు.. నీ కష్టార్జితాన్ని ఎవరైనా దొంగిలిస్తుంటే.. వదిలిపెట్టొద్దు అన్న సైరా మాటలే ఆ పసివాడ్ని పిడికెడు గింజలు తీసుకుని ఆంగ్లేయులపై జనం తిరుగుబాటుకు దారి వేశాయి.

సైరాతో.. సిద్దమ్మ తొలిసారిగా ఏకాంతంగా కలుసుకున్నప్పుడు నయనతార చెప్పిన డైలాగ్.. ‘మిమ్మల్ని చూడొచ్చా.. మిమ్మల్ని తాకవచ్చా’ అని అడిగినప్పుడు చిరంజీవి చెయ్యి ఆమె భుజం మీద చెయ్యి పడగానే ఎడమ కంటి నుంచి కారిన కన్నీటి ధార కానీ.. ఆమె ముఖాన్ని సైరా పైకెత్తి చూసినప్పుడు ఎడమ కంటి నుంచి ధారగా కారిన ఆనందబాష్పాలు కానీ ప్రక్షకుల్ని కాస్త ఉద్వేగానికి గురిచేశాయనే చెప్పాలి.రైతు సుబ్బయ్య పాత్రలో నటించిన సాయిచంద్.. భూమి కోసం గుర్రంతో పరుగుపెట్టిన సీన్.. ఆ తరువాత యుద్ధంలో సైరాతో పాలెగాళ్ళెవరూ కలిసి రానప్పుడు సుబ్బయ్య తాను నీ వెంటే ఉంటానంటూ.. యుద్ధానికి తాను మానసికంగా.. శారీరకంగా సన్నద్ధం అయ్యానంటూ కత్తిని రాతి నేలలో దిగేసిన సీన్ బాగా ఆకట్టుకున్నాయి. చివరిలో స్వాతంత్ర్య పోరాటంలో మరణిస్తూ.. ‘చావంటే ఇదిరా’ అంటూ సుబ్బయ్య పాత్రధారి సాయిచంద్ చేసిన తీరు అద్భుతంగా పండింది.

నాట్యం, నరసింహారెడ్డి పాటలతో ప్రజల గుండెల్లో స్వాతంత్ర్య కాంక్షను, ఆంగ్లేయులపై తిరుగుబాటు వైపు ఆకర్షితులను చేస్తోందన్న కారణంతో లక్ష్మిని బంధించిన ఆంగ్లేయులు బట్టల్లేకుండా తమ ముందు డ్యాన్స్ చేసి ఆకర్షించాలన్న తర్వాత సైరా మాటలు ‘ఎందుకు మరణించాలో తెలుస్తుంద’న్న మాటలకు అర్థం వచ్చేలా చేస్తుంది. తన పైటనే ఆయుధంగా మలచి, మంటలంటించి, తాను కాలిపోతూ అక్కడున్న పేలుడు సామగ్రిని అంటించడతో ఆంగ్లేయులంతా పటాసుల్లా కాలిపోయిన సీన్ రక్తి కట్టించింది. లక్ష్మి కూడా అవే మంటల్లో కాలి బూడిదైపోయిన సీన్ గుండెల్ని పిండేసేలా అనిపించింది.

ఉరికంబానికి వేలాడదీసిన తర్వాత మరణించాడనుకున్న సైరా నరసింహారెడ్డి ఒక్కసారిగా పైకెగసి ఆంగ్లేయులను దునుమాడిన సీన్‌ను చిరంజీవి అత్యద్భుతంగా పండించాడు. ఈ సందర్భంగా సైరా తలను ఆంగ్లేయుడొకడు నరికినప్పుడు కూడా తలలేని మొండెంతో నరసింహారెడ్డి కిరాతకులైన ఆంగ్లేయుల్ని తెగనరికిన సీన్ సంభ్రమాశ్చార్యాలకు గురిచేసింది.

ఇలాంటి అనేక సీన్లు సైరా నరసింహారెడ్డి సినిమాలో ప్రేక్షకుల హృదయాలను సూటిగా తాకుతున్నాయి.

డి.వి.రాధాకృష్ణ
క్లార్క్స్‌బర్గ్ (మేరీల్యాండ్- అమెరికా)