శ్వేతనాగుకు అరుదైన శస్త్ర చికిత్స!

20 May, 2018 - 11:00 AM

(న్యూవేవ్స్ డెస్క్)

తణుకు (ప.గో.జిల్లా): ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో విష సర్పాలకు కూడా మెరుగైన వైద్య విధానం అందుబాటులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని రాష్ట్ర పశు వైద్యశాలలో శనివారం సాయంత్రం తెల్ల నాగుపాముకు వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు.

ఆసుపత్రి అసిస్టెంట్‌ పశు శస్త్ర చికిత్సా నిపుణుడు డాక్టర్‌ ఆర్‌.శ్రీధర్‌ సమాచారం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంలో నాలుగు రోజులుగా తెల్ల త్రాచుపాము కదలలుని పడి స్థితిలో ఉండగా ఆ గ్రామానికి చెందిన రైతులు జంగారెడ్డిగూడెం స్నేక్‌ సేవియర్‌ సంస్థకు సమాచారం అందించారు. దీనితో జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన స్నేక్‌ సేవియర్‌ చదలవాడ క్రాంతి కృష్ణాయపాలెం పొలంలో కదల్లేని స్థితిలో ఉన్న తెల్ల త్రాచుపామును శనివారం మధ్యాహ్నం తణుకు పాలి క్లీనిక్‌‌కు తరలించారు.

అక్కడి వైద్యుల సూచన మేరకు పాముకు ఎక్స్‌ రే తీయించగా పాము మెడ భాగంలో బలమైన పశువు తొక్కడంతో ఎముక విరిగిపోయిందని, దీంతో పాము ఆహారం తీసుకోకపోవడంతో చలనం లేకుండా పడి ఉందని వైద్యులు తెలిపారు.

అనంతరం వైద్యుల పర్యవేక్షణలో పాముకు ఆహారం అందించి, మెడ చుట్టూ స్లిపంకర్లు వేసి చికిత్స చేసినట్లు డాక్టర్ శ్రీధర్ తెలిపారు. పాముకు వారం రోజులకు సరిపడినంత ఆహారాన్ని అందించామని డాక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. కాగా.. తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకూ 10,880 ఆపదలో ఉన్న పాములను రక్షించి అటవీ ప్రాంతంలో వదిలినట్లు క్రాంతి తెలిపారు.