వీవీ ప్యాట్లపై ఈసీకి సుప్రీంకోర్టు నోటీసు..!

15 March, 2019 - 1:06 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌‌పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ పిటిషన్‌‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. పిటిషన్‌ విచారణ సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ నుంచి ఒక అధికారి కోర్టుకు హాజరు కావాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మార్చి 25లోగా దీనిపై బదులివ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈసీని ఆదేశించింది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓటు రసీదు యంత్రాలను (వీవీప్యాట్‌‌లను) లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాల దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ద్వారా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లు- వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పుల మధ్య వ్యత్యాసం ఎంటున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లకు, వీవీప్యాట్‌ యం‍త్రాలు జారీచేసిన రసీదులను సరిపోల్చి చూడాల్సిందే అని ఆయా పార్టీలు సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశాయి.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం మేరకు వీవీప్యాట్‌‌లను లెక్కించి, వాటిని ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చేలా నిబంధనలు తీసుకురావాలని 23 రాజకీయ పార్టీలు గత నెలలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశాయి. నియోజకవర్గంలో ఎంపిక చేసిన బూత్‌‌లోనే వీవీపాట్‌‌ల పరిశీలన చేపట్టాలన్న ఈసీ నిర్ణయంపై సుప్రీంను ఆశ్రయించాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా, ఎస్పీ, బీఎస్పీ ఎంపీలు రాంగోపాల్‌ యాదవ్‌, సతీష్‌ చంద్ర మిశ్రాల నేతృత్వంలో 21 పార్టీల నేతలు ఫిబ్రవరి 4న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా, కమిషనర్‌ అశోక్‌ లవాసాలను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే.. ఈసీ నుంచి సంతృప్తికరమైన స్పందన రాకపోవడంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.