రాహుల్ గాంధీకి సుప్రీం షోకాజ్!

15 April, 2019 - 2:06 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఏఐసీసీ చీఫ్ రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. చౌకీదార్‌ చోర్‌ (కాపలాదారే దొంగ) అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించినందుకు గాను ఈ నెల 22 లోగా వివరణ ఇవ్వాలంటూ రాహుల్‌‌కు జారీచేసిన షోకాజ్‌ నోటీసులో ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 23న చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ దొంగ అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నోటీసు ఈ జారీ చేసింది. రాఫెల్ కేసు విషయంలో తాము విచారిస్తామంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన క్రమంలో రాహుల్ గాంధీ ఇలా వ్యాఖ్యానించారు.

అయితే.. రాఫెల్‌ తీర్పుపై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. కాపలాదారే దొంగ అని తాము ఎప్పుడూ అనలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. ఆ వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టుకు ఆపాదించవద్దని రాహుల్ గాంధీకి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఏప్రిల్ 22 లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ఫ్రాన్స్‌తో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీగా అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ కొన్నిరోజులుగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల లీకైన రాఫెల్ పత్రాల ఆధారంగా గతంలో రాఫెల్ ఒప్పందంపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.