ఆరుషి హత్య కేసులో మరో మలుపు

10 August, 2018 - 4:23 PM

(న్యూవేవ్స్ డెస్క్)

న్యూఢిల్లీ: ఆరుషి తల్వార్‌ జంట హత్యల కేసు మరో మలుపు తిరిగింది. తల్వార్‌ దంపతులను అలహాబాద్‌ కోర్టు నిర్దోషులుగా పేర్కొడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. దంత వైద్యులైన నూపుర్, రాజేశ్ తల్వార్‌ దంపతుల కుమార్తె ఆరుషి, వాళ్ల ఇంట్లో పనిమనిషి హేమరాజ్‌‌లు 2008లో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఘజియాబాద్‌ కోర్టు తల్వార్‌ దంపతులను దోషులుగా తేల్చి 2013లో యావజ్జీవ శిక్ష విధించింది. అయితే.. సరైన సాక్ష్యాలు లేని కారణంగా ఆరుషి తల్లిదండ్రులను అలహాబాద్‌ కోర్టు నిర్దోషులుగా నిర్ధారించి 2017లో తీర్పు వెలువరించింది.

తల్వార్‌ దంపతులను నిర్దోషులుగా పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ హేమరాజ్‌ భార్య కుంకాల బంజాడే వేసిన పిటిషన్‌ ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉంది. తాజాగా సీబీఐ కూడా ఈ కేసులో పునర్విచారణ కోరుతూ పిటిషన్‌ వేయడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగింది.