ప్లే ఆఫ్‌కు సన్ రైజర్స్

14 May, 2017 - 9:55 AM

డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. తప్పనిసరిగా గెలవాల్సిన లీగ్ ఆఖరు మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటింది. గుజరాత్ లయన్స్ పై విజయం సాధించి ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది. బంతితో రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.. బ్యాటుతో వార్నర్, విజయ్ శంకర్ లీగ్ ఆఖరు పోరులో కీలకంగా నిలిచారు. మొత్తం మ్యాచ్ ల్లో 8 విజయాలు.. 5 పరాజయాలు అందుకోగా, 1 మ్యాచ్ రద్దు కావడంతో 17 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్.

కాన్పూర్ వేదికగా శనివారం గుజరాత్ లయన్స్‌పై 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించి ప్లేఆఫ్ లో స్థానం ఖరారు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 19.2 ఓవర్లలో 154 పరుగులకే అలౌట్ అయింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (61), డ్వేన్ స్మిత్ (54) గొప్ప ఆరంభానిచ్చి తొలి వికెట్‌కు 111 పరుగులు జోడించారు. కానీ మహ్మద్ సిరాజ్ (4/32), రషీధ్ ఖాన్ (3/34) అద్భుత బౌలింగ్ కు బ్యాట్స్‌మెన్లందరూ పెవిలియన్ బాట పట్టారు. దీంతో 154 పరుగులకే గుజరాత్ కుప్పకూలింది.

అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని చేధించింది. ప్రవీన్ కుమార్ వేసిన మూడో ఓవర్లోనే ధావన్ (18), హెన్రిక్స్ (4)పెవిలియన్ చేరారు.ఆ తర్వాత స్కిపర్ డేవిడ్ వార్నర్ (69)కు విజయ్ శంకర్ (63) తోడుగా నిలవడంతో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించారు. వీరి భాగస్వామ్యానికి 133 పరుగులు జోడించి అజేయంగా నిలిచారు.