తక్కువ పాయింట్లతో ప్లేఆఫ్‌కు సన్‌రైజర్స్

06 May, 2019 - 2:13 PM

(న్యూవేవ్స్ డెస్క్)

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో లీగ్ దశ ఆదివారంతో ముగిసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన తుది లీగ్ మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌‌లో కోల్‌‌కతా ఓడిపోటంతో హైదరాబాద్‌ మెరుగైన రన్‌‌రేట్‌‌తో ప్లేఆఫ్‌ బెర్త్‌‌ను ఖాయం చేసుకుంది. దీంతో ఈ సీజన్‌‌లో ప్లేఆఫ్‌‌కు చేరిన నాలుగో జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచింది.

అయితే.. ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువగా కేవలం12 పాయింట్లతో ప్లేఆఫ్‌‌కు చేరిన జట్టుగా హైదరాబాద్ రికార్డుకెక్కింది. ఈ సీజన్‌‌లో మిగతా జట్లన్నీ 14 పాయింట్లతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. ఈ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌‌లో ముంబై చేతిలో కోల్‌‌కతా ఓడిపోవడంతో సన్‌‌రైజర్స్‌‌కు ప్లేఆఫ్‌కు అర్హత వచ్చింది.

2019 ఐపీఎల్ సీజన్‌‌‌లో సన్‌‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్లు 12 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే.. ఈ మూడు జట్లలో నెట్‌ రన్‌‌రేట్‌ (+0.577) విషయంలో సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్ మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్‌‌కు అర్హత సాధించింది. సన్‌‌రైజర్స్‌‌తో పోలిస్తే కోల్‌‌కతా (+0.028), పంజాబ్‌ (-0.251) రన్‌‌రేట్ తక్కువగా ఉంది.

మరో పక్కన ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్‌కు చేరింది. చెన్నై, ఢిల్లీ కూడా 18 పాయింట్ల సాధించినప్పటికీ, ముంబై నెట్‌ రన్‌‌రేట్‌ (+0.421)తో ముందంజలో నిలిచింది. ఇక ఢిల్లీతో పోలిస్తే చెన్నై (+0.131) మెరుగైన రన్‌‌రేట్‌‌తో రెండో స్థానంలో ఉంది.

ఐపీఎల్ 2019 ప్లేఆఫ్స్:
మే 7: క్వాలిఫయిర్ 1 – ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్- చిదంబరం స్టేడియం, చెన్నై- రాత్రి 7.30 గంటలకు ప్రారంభం

మే 8: ఎలిమినేటర్- ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌‌రైజర్స్ హైదరాబాద్- ఏసీఏ- వీడీసీఏ స్టేడియం, విశాఖపట్నం – రాత్రి 7.30 గంటలకు మొదలు

మే 10: క్వాలిఫయిర్ 2- లూజర్ ఆఫ్ క్వాలిఫయర్ 1 vs విన్నర్ ఆఫ్ ఎలిమినేటర్- ఏసీఏ- వీడీసీఏ స్టేడియం, విశాఖపట్నం- రాత్రి 7.30 గంటలకు

మే 12: ఐపీఎల్ ఫైనల్- ఉప్పల్ స్టేడియం- హైదరాబాద్.