చెలరేగిన ఛెత్రి.. భారత్‌కే ఫుట్‌బాల్ కప్

11 June, 2018 - 11:12 AM

(న్యూవేవ్స్ డెస్క్)

ముంబై: భారత ఫుట్‌బాట్ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి అద్వితీయమైన ఫామ్‌‌లో చెలరేగిపోతున్నాడు. ముంబై వేదికగా జరిగిన ఇంటర్‌ కాంటినెంటల్‌ ఫుట్‌‌బాల్‌ కప్‌‌ను భారత్‌కు సాధించి పెట్టాడు. సూపర్‌ ఫామ్‌‌లో ఉన్న ఛెత్రి రెండు గోల్స్‌ కొట్టడంతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 2-0తో కెన్యాపై విజయం సాధించింది. కెరీర్‌‌లో 102వ అంతర్జాతీయ మ్యాచ్‌‌లో బరిలోకి దిగిన ఛెత్రి 8వ, 29వ నిమిషాల్లో గోల్స్‌ చేశాడు.

ముంబై ఫుట్‌‌బాల్‌ ఎరీనాలో జరిగిన మ్యాచ్‌‌లో ఆద్యంతం భారత్‌‌ ఆధిపత్యం ప్రదర్శించింది. ఎనిమిదో నిమిషంలో థాపా నుంచి పాస్‌‌ను అందుకున్న ఛెత్రి తర జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. చక్కని సమన్వయంతో ఆడిన భారత ఆటగాళ్లు కెన్యా డిఫెన్స్‌‌పై ఒత్తిడి కొనసాగించారు. విరామానికి ముందే ఛెత్రి భారత్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. అనాస్‌ ఎదాతొడిక నుంచి వచ్చిన బంతిని ఛాతితో చక్కగా నియంత్రించిన ఛెత్రి కెన్యా డిఫెండర్లు అటుడో, కిబ్వాగెలను బోల్తా కొట్టిస్తూ గోల్‌ చేశాడు.

భారత్‌ ఆధిక్యం మరింత పెరిగేదే. అయితే.. 43వ నిమిషంలో ఛెత్రి ఫ్రీకిక్‌ బార్‌‌పై నుంచి వెళ్లింది. గోల్‌‌కీపర్‌ గుర్‌‌ప్రీత్‌ సింగ్‌ సంధు.. కెన్యా గోల్‌ ప్రయత్నాలను చక్కగా అడ్డుకున్నాడు. ఈ మ్యాచ్‌‌లో భారత డిఫెండర్లు మెరుగైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా నజారి, సందేశ్‌ ఆకట్టుకున్నారు.

ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ జట్టుకు అత్యధిక గోల్స్ చేసిన ఫుట్‌‌బాల్ ఆటగాళ్ల జాబితాలో ఛెత్రి మూడో స్థానంలో ఉన్నాడు. కెన్యాపై వరుసగా రెండు గోల్స్ చేయడం ద్వారా 64 గోల్స్‌‌తో మెస్సీ రికార్డును ఛెత్రి సమం చేశాడు. టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన కొనసాగించిన ఛెత్రి.. ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్‌‌బాల్‌ ఆటగాళ్లలో అత్యధిక గోల్స్‌ కొట్టిన రెండో ఆటగాడిగా అర్జెంటీనా సూపర్‌‌స్టార్‌ లియోనల్‌ మెస్సి సరసన నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో 81 గోల్స్‌‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ కాంటినెంటల్‌ కప్‌‌లో భారత్‌ సాధించిన 11 గోల్స్‌‌లో ఎనిమిది ఛెత్రి చేసినవే కావడం విశేషం.

చైనీస్ తైపీతో జరిగిన ప్రారంభ మ్యాచ్‌‌లో హ్యాట్రిక్ గోల్స్‌‌తో ఛెత్రి భారత్‌‌ను గెలిపించినప్పటికీ.. ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులు మైదానానికి రాలేదు. దీంతో ‘మమ్మల్ని తిట్టండి, నిలదీయండి కానీ మ్యాచ్ చూడటానికి మాత్రం రమ్మని’ ఆవేదనతో అభిమానులకు ఛెత్రి పిలుపునిచ్చాడు. ఈ విషయంపై కోహ్లి, సచిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు అతడికి బాసటగా నిలిచారు. ఆ తర్వాత భారత ఫుట్‌‌బాల్ జట్టు ఆడిన మ్యాచ్‌‌లకు ప్రేక్షకులు భారీగా హాజరయ్యారు.

భారత్, చైనీస్ తైపీ, కెన్యా, న్యూజిలాండ్ జట్లు తలపడిన ఇంటర్‌ కాంటినెంటల్ కప్ జూన్ 1న ప్రారంభమైంది. న్యూజిలాండ్‌ చేతుల్లో మాత్రమే ఓడిన భారత్ మిగతా మ్యాచ్‌‌ల్లో తిరుగులేని ఆటతీరు కనబర్చింది.