ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మృతి

14 May, 2018 - 4:16 PM

(న్యూవేవ్స్ డెస్క్)

సురాబయా: బాంబు పేలుడుతో ఇండోనేషియాలోని సురాబయా నగరం మరోసారి దద్దరిల్లిపోయింది. ఆదివారం ఇదే నగరంలో మూడు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగి 13 మంది అమాయక ప్రజలు బలైన విషయం తెలిసిందే. 24 గంటలు గడవక ముందే మరో బాంబు పేలుడు చోటుచేసుకుంది. సురాబయాలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద మోటార్‌ సైకిల్‌‌పై వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు తమను తాము పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయినట్లు ఇండోనేషియా మీడియా వెల్లడించింది.

‘ఇద్దరు వ్యక్తులు బైక్‌‌పై హెడ్‌‌క్వార్టర్స్‌ వద్దకు వచ్చారు. సెక్యూరిటీ చెక్‌‌పాయింట్ వద్ద పోలీసులు వారిని ఆపి తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఇంతలోనే వారు తమను తాము పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల్లో ఓ మహిళ కూడా ఉంది’ అని ఈస్ట్‌ జావా పోలీసు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆదివారం జరిగిన దాడులు మరవక ముందే మరో ఉగ్రవాది జరగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు భద్రతా సిబ్బంది అప్రమత్తమై నగరవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

ఇండోనేషియాలో రెండో అతిపెద్ద నగరమైన సురాబయలో ఆదివారం మూడు చర్చిల్లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు పాల్పడ్డారు. ఇద్దరు కుమార్తెలతో కలిసి తల్లి ఓ చర్చిలో దాడికి తెగబడగా.. 16, 18 ఏళ్ల వయసున్న కుమారులు, తండ్రి మరో రెండు చోట్ల పేలుళ్లు జరిపారని వివరించారు. వీరంతా తమ ముష్కరులేనని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ప్రకటించింది. ఈ దాడుల్లో 13 మంది మరణించగా.. మరో 41 మంది గాయపడ్డారు.