పీఎంకి సీఎం లేఖ

05 December, 2019 - 12:28 AM

(న్యూవేవ్స్ డెస్క్)

చెన్నై: సూడాన్‌ అగ్నిప్రమాద ఘటనలో గాయపడిన భారతీయులకు మెరుగైన వైద్య సాయం అందించేలా అక్కడి భారతీయ రాయబార కార్యాలయాన్ని ఆదేశించాలని ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం కె.పళని స్వామి విజ్ఞప్తి చేశారు. అందుకోసం వ్యక్తిగతంగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని సీఎం పళని స్వామి కోరారు.

ఈ మేరకు బుధవారం ప్రధాని మోదీకి సీఎం పళని స్వామి లేఖ రాశారు. ఈ అగ్ని ప్రమాద ఘటనలో తమిళనాడుకు చెందిన ముగ్గురు తీవ్ర గాయాల పాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. మరో ముగ్గురు గల్లంతయ్యారని వార్తలు వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంలో జోక్యం చేసుకుని… తమిళనాడుకి చెందిన వారి పరిస్థితులు తెలియజేయాలని అక్కడి రాయబారి కార్యాలయాన్ని ఆదేశించాలని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు.

సూడాన్‌ రాజధాని ఖార్తూమ్‌ నగరంలోని బహ్రి ప్రాంతంలో సీలా సిరామిక్ ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం ఎల్పీజీ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. వారిలో ఆరుగురు
భారతీయులు ఉన్నారని… అందులో ముగ్గురు తమిళనాడు వాసులను ఖారూమ్‌లోని రాయబార కార్యాలయం ప్రకటించింది.

ఈ ప్రమాదంలో 130 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇక ఈ ప్రమాద ఘటనలో పలువురు గల్లంతయ్యారు. అంటే.. ఈ ప్రమాదంలో సజీవ దహనం అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆ క్రమంలో వారి వివరాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు.