ఆంధ్రా బ్యాంకు.. నేపథ్యం

06 September, 2019 - 11:21 PM

       (డి.వి.రాధాకృష్ణ)

బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల పేరుతో పది ప్రభుత్వ బ్యాంకులను మెగా విలీనం చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం పేర్కొంది. సెప్టెంబర్ 30వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు మీడియా సమావేశంలో ఓ ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఆంధ్రుల కోసం ఆంధ్రుడైన స్వాతంత్ర్యోద్యమ నేత డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య నెలకొల్పిన 96 వసంతాల సుదీర్ఘ చరిత్ర గల ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. కేంద్ర తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రారంభమైన ఆంధ్రా బ్యాంకు ఉనికిని కోల్పోతున్నది. తెలుగు రాష్ట్రమైన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ఇప్పటి తెలంగాణలో ఏర్పాటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌ను ఇలాగే రెండేళ్ళ క్రితం స్టేట్ బ్యాంక్‌లో కేంద్రం విలీనం చేసేసింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకంగా కార్యకలాపాలు నిర్వహించిన బ్యాంకులకు నూరేళ్ళు నిండిపోయినట్లయింది.

ఈ నేపథ్యంలో ఆంధ్రుల గర్వకారణమైన ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు నేపథ్యం, చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం సందర్భోచితం అవుతుంది. భారతదేశంలోని ప్రసిద్ధ వాణిజ్య బ్యాంకులలో ఆంధ్రా బ్యాంకు ఒకటనే చెప్పాలి. ఈ బ్యాంకును 1923 నవంబర్ 20న స్థాపించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి భోగరాజు పట్టాభి సీతారామయ్య మచిలీపట్నంలో స్థాపించారు. 1980లో ఆంధ్రా బ్యాంకును అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయం చేసింది. 1981లో క్రెడిట్ కార్డుల్ని జారీ చేయడం ద్వారా ఆంధ్రా బ్యాంకు మన దేశానికి క్రెడిట్ కార్డు వ్యవస్థను పరిచయం చేసింది. 2003 నాటికి దేశంలో నూరు శాతం కంప్యూటరీకరణ జరిగిన బ్యాంకుగా ఇది నిలిచింది. అలాగే 2007 నాటికి బయోమెట్రిక్ ఏటీఎంలను కూడా ఆంధ్రా బ్యాంకే దేశానికి పరిచయం చేసింది. పెట్టుబడులు రాబట్టడంలో ఆంధ్రా బ్యాంకు ఆసియాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. భారతదేశం మొత్తంలో ఆంధ్రా బ్యాంకు 1,30,000 మంది షేర్ హోల్డర్లు, 1,372 కోట్ల మంది ఖాతాదారులతో అలరారుతోంది. ఆంధ్రా బ్యాంకు ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకూ మొత్తం రుణాలలో కనీసం 50 శాతానికి తగ్గకుండా రుణాల్ని గ్రామీణ భారతానికి అందిస్తోంది.

అయితే.. ఆంధ్రా బ్యాంకు పుట్టు పూర్వోత్తరాల గురించి దాని వ్యవస్థాపకుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యే స్వయంగా పేర్కొన్నారు. ఆంధ్ర దేశంలో ఒక కమర్షియల్ బ్యాంకు సంస్థను స్థాపించాలనే ఉద్దేశం మొట్టమొదట ఆయనకు 1923 సెప్టెంబర్ నెలలో కలిగిందట. అప్పటి బందరు పట్నం ఇప్పటి మచిలీపట్నంలోని కొందరు మిత్రులను ఒక సాయంకాలం వేళ సమావేశ పరిచి తన ఉద్దేశాన్ని చెప్పారట. అయితే.. తొలి సమావేశంలో వారెవరూ తగినంత పెద్ద మొత్తాలు విరాళంగా వేయడానికి సాహసించలేదట. దాంతో డాక్టర్ పట్టాభి సీతారామయ్య కొంత నిరుత్సాహానికి గురయ్యారట. అయితే.. కొందరు వేసిన విరాళాలు రూ.10 వేలు మాత్రమే పోగవడంతో బ్యాంకును స్థాపించడం కుదరదని నిస్పృహ చెంది, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారట.

రెండు మూడు రోజుల తర్వాత తమ ఇంటికి దగ్గర్లోనే నివసించే నంబూరి వెంకట సుబ్బారావు డాక్టర్ పట్టాభి సీతారామయ్య వద్దకు వచ్చి, బ్యాంకు స్థాపన ప్రయత్నం ఎంతవరకూ వచ్చిందని అడిగారట. ఆంధ్రా బ్యాంకు ఏర్పాటైన తర్వాత ఈ సుబ్బారావు పదేళ్ళ పాటు గౌరవ కార్యదర్శిగా పనిచేశారు. తాను ఏర్పాటు చేయదలచిన బ్యాంకు బందరు పట్నంలోని వ్యాపారుల ప్రయోజనం కోసం ఉద్దేశించినదని, అలాంటి చోట స్థానిక వ్యాపారులు దాని పట్ల ఉత్సాహం చూపించనందున ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని చెప్పారట. దాంతో వెంకట సుబ్బారావు వెంటనే తాను స్వయంగా రూ.3 వేలు చందా వేయడమే కాకుండా డాక్టర్ పట్టాభి సీతారామయ్యతో కలిసి ఇతర మిత్రులను కలుసుకునేందుకు వచ్చారట. అలా ఉదయం పదిన్నర అయ్యేసరికి మరో ఇద్దరు మిత్రులు వేసిన చందాతో కలిపి మొత్తం రూ.10,500 పోగయ్యాయట. ఈ లోగా ఓ చిన్న సంఘటన జరిగిందని సీతారామయ్య చెప్పుకున్నారు. పట్నంలోని వ్యాపారులందరిలోకి జ్ఞానవంతుడైన యు.గోపాలరత్నం తాము రూ.3 వేలు ఇష్టపూర్వకంగా చందా వేసి, డాక్టర్ సీతారామయ్యను కూడా సంస్థలో భాగస్వామిగా ఉండాలని పట్టుపట్టారట. ఈ సంస్థ కేవలం వ్యాపారుల సంస్థగానే ఉండాలని, దాని నిర్వహణలో తాను స్వయంగా వేలు పెట్టకూడదని అంతవరకూ డాక్టర్ సీతారామయ్య అనుకున్నారట. అయితే.. గోపాలరత్నంను తృప్తి పరిచేందుకు తాను వెయ్యి రూపాయలు మాత్రం చందా వేశారట.ఇక ఆ రోజు మొదలు తమ ప్రయత్నం చాలా వేగంగా రూపుదాల్చడం మొదలైందని డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో తాము అనుకున్న చందా మొత్తం కంటే రూ. 18 వేలు ఎక్కువ కాగితం మీద పడిందట. ఈ లోగా తాను సంస్థ నియమావళి, మెమొరాండం రాసి సిద్ధం చేశారట. మాట కలిసిన చందాదారులందరినీ ఒకచోటకు చేర్చి వాటిని వినిపించారట. ఆ సమావేశానికి వచ్చిన వారిలో చాలా మందికి ఉత్సాహం పెరిగి ఇంకా ఇంకా వాటాలు వేస్తామంటూ ముందుకు వచ్చారట. అయితే.. అలా ముందుకు వచ్చిన కొందరు తమ వాగ్దానం ప్రకారం పూర్తి చందాలు నగదు రూపంగా చెల్లించలేకపోయారట. ఏదైతేనేం 1923 నవంబర్ 20వ తేదీన ఆంధ్రా బ్యాంకు రిజిస్టరైందని డాక్టర్ సీతారామయ్య వివరించారు.

ఇక అప్పటి నుంచి తమకు చిక్కులు కూడా మొదలయ్యాయని డాక్టర్ భోగరాజు చెప్పుకున్నారు. తమ సంస్థతో ఎలాంటి సంబంధాలూ పెట్టుకోవద్దని బందరులోని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచి ఏజెంటు అయిన ఒక తెల్లదొర రహస్యంగా పట్టణంలోని వ్యాపారులను వెనక్కి లాగినట్లు తన దృష్టికి తొలిసారిగా వచ్చిందట. దీంతో తమ సంస్థలో డైరెక్టర్లుగా ఉండేందుకు తొలుత ఉత్సాహం చూపించిన వారంతా వెనక్కి తగ్గారట.

ఇలాంటి పరిస్థితిలో యు.గోపాలరత్నం బలవంతం, ప్రోద్బలంతో తనను మేనేజిండ్ డైరెక్టర్ పదవిలో బంధించారని డాక్టర్ భోగరాజు పేర్కొన్నారు. వ్యాపారుల సౌకర్యం కోసం ఏర్పాటైన ఆంధ్రా బ్యాంకు ప్రారంభమైంది కానీ తెల్లదొర మీద ఉన్న భయంతో దాని నుంచి అప్పు తీసుకోడానికి వ్యాపారులెవరూ ముందుకు రాలేదట. అయినప్పటికీ స్థానిక వర్తకులకు ఏదో విధంగా రూ. 30 వేల వరకూ అప్పులు ఇవ్వగలిగారట. అక్కడి నుంచి ఆంధ్రా బ్యాంకు క్రమేపీ వేగంగా పెరిగి బలపడసాగింని డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య వివరించారు. గతంలో ఇంపీరియల్ బ్యాంకు ఆఫ్ ఇండియాతో మాత్రమే సంబంధం పెట్టుకున్న రాజభక్తులైన వ్యాపారులు తర్వాత్తర్వాత ఆ బ్యాంకు బాకీలను తీర్చుకునేందుకు ఆంధ్రా బ్యాంకులో అప్పులు తీసుకుని ప్రోత్సహించారట.

అలా ఆనాడు అత్యంత చిన్న సంస్థగా ప్రారంభమైన ఆంధ్రా బ్యాంకు ఈ నాడు శాఖోపశాఖలుగా విస్తరించింది. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆనాడే విశ్వాసం వ్యక్తం చేసిన విధంగా భారతదేశం మొత్తంలో ఆంధ్రా బ్యాంకు చెప్పకోదగ్గ అతి కొద్ది గొప్ప బ్యాంకుల్లో ఒకటిగా పేరు పొందింది. అయితేనేం.. ఈ నాడు కేంద్రప్రభుత్వం నిర్ణయంతో ఆంధ్రా బ్యాంకు ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి ఎదురవడం అత్యంత బాధాకరం.

(క్లార్క్స్‌బర్గ్- మేరీల్యాండ్- అమెరికా నుంచి)